Pakistan Cricket: మళ్లీ మార్చేశారు.. గిలెస్పీ స్థానంలో పాకిస్తాన్ జట్టుకు కొత్త కోచ్‌!

క్రికెట్ అభిమానులకు ఇదేం కొత్త విషయం కాకపోవచ్చు. సిరీస్ ఓడిన ప్రతిసారి పాకిస్తాన్ క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు సదా మామూలే. పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఓటములకు బాధ్యులైన ఆటగాళ్లను తప్పించాల్సింది పోయి కోచ్‌లను మారుస్తూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి అలాంటిదే జరిగింది. ఆస్ట్రేలియా చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన గంటల వ్యవధిలోనే ఆ జట్టు ప్రధాన కోచ్ జేస‌న్ గిలెస్పీపై వేటు వేసింది. ఇప్పటికే ఈ విషయం అతనికి తెలియజేయగా.. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.   

విదేశీయుల సేవలు చాలనుకున్న పీసీబీ

ప్రధాన కోచ్ జేస‌న్ గిలెస్పీని తప్పించిన పాక్ క్రికెట్ బోర్డు.. నూతన కోచ్‌గా ఆ జట్టు మాజీ బౌలర్ ఆకిబ్ జావేద్‌ను నియమించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, గిలెస్పీని పీసీబీ తప్పించలేదని.. అతనే వైదొలగాలనుకున్నట్లు తన నిర్ణయాన్ని బోర్డుకు తెలియజేసినట్లు ఇఎస్‌పిఎన్‌ కథనాన్ని ప్రచురించింది. పాక్ ఆల్-ఫార్మాట్ కోచ్‌గా ఆకిబ్ జావేద్‌ నియామకంపై సోమవారం ప్రకటన వెలుబడనున్నట్లు తెలుస్తోంది.

గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు పాకిస్థాన్ వైట్ బాల్ కోచ్‌ పదవి నుంచి గ్యారీ కిర్‌స్టన్ తప్పుకున్నాడు. పీసీబీ మొండి వైఖరి, ఆటగాళ్ల మధ్య గొడవలు చూడలేక కోచ్ పదవికి గుడ్ బై చెప్పాడు. దాంతో, పీసీబీ.. కిర్‌స్టన్ స్థానంలో  గిలెస్పీని నియమించింది. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ వరకు అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్‌కు కోచ్‌గా ఉండాలని అతన్ని కోరింది. అయితే, అందుకు ఆసీస్ మాజీ పేసర్ అంగీకరించలేదని సమాచారం. ఒకవేళ, స్వదేశంలో జరిగే ఆ టోర్నీలో ఆతిథ్యజ్ ట్టు ఓడితే.. తనను తప్పిస్తారనే భయం అతన్ని వెంటాడింది. ఈ క్రమంలో అతను ముందుగానే వైదొలిగాడు.