- జనవరి చివరి వరకు ముగియనున్న ప్రక్రియ
- ఉద్యోగుల సగటు వేతనం రూ.10–12 లక్షలు
న్యూఢిల్లీ : ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ దేశవ్యాప్తంగా 2,000 మంది ఉద్యోగులను తీసివేయాలనుకుంటోంది. ఉద్యోగుల ఖర్చులను తగ్గించడానికి, కొన్ని ప్రాసెస్‌లను పూర్తిగా టెక్ ఆధారితంగా మార్చడానికి జనవరి చివరి వరకు ఈ ఉద్యోగులను తీసివేయనుందని కంపెనీకి చెందిన కొందరు చెప్పారు. సేల్స్, సప్లయ్, ఆపరేషన్స్ వంటి డివిజన్లలో ఈ లేఆఫ్స్ అధికంగా ఉంటాయని తెలిపారు. తీసివేసే ఈ ఉద్యోగుల స్థానాల్లో ఓయో ఇప్పట్లో కొత్త వారిని తీసుకోదని కూడా తెలుస్తోంది. ‘మెరిట్ ఆధారంగా ఉద్యోగుల పనితీరును లెక్కించే ప్రొగ్రామ్‌ను చేపడతాం. ప్రతి నెల ప్రతి ఒక్కరి పనితీరును ఓయో ట్రాక్ చేస్తోంది. ఆ ఫలితాలను బట్టి పనితీరును మెరుగుపరుచుకునే ప్రొగ్రామ్‌ను చేపడుతున్నాం. అప్పుడు కూడా సరిగ్గా పనిచేయలేని వారి ప్లేస్‌లో కొత్త వారిని తీసుకుంటున్నాం’ అని ఓయో అధికార ప్రతినిధి చెప్పారు. కానీ సంస్థ చేపట్టిన ఎవాల్యుయేషన్‌లో సరియైన గ్రేడ్స్ ఉన్నప్పటికీ, కొందరు ఉద్యోగులను ఓయో తీసేస్తోందని మరికొంత మంది ఆరోపిస్తున్నారు. సాధారణంగా డీ రేటింగ్‌తో ఉన్న ఉద్యోగులను ఓయో తీసేస్తుందని, కానీ బీ రేటింగ్స్ వచ్చినా కొందరిని కంపెనీ నుంచి బయటికి వెళ్లిపోవాలని ఆదేశిస్తోందని చెప్పారు. టెక్నాలజీతో లింక్ అయి ఉన్న కొన్ని రోల్స్‌ను మాత్రమే రీప్లేస్ చేస్తున్నామని, ప్రతి టీమ్ మెంబర్‌కు మరో అవకాశం అందిస్తున్నామని ఓయో అధికార ప్రతినిధి చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరి చివరి వరకు ఉద్యోగుల ఖర్చులను తగ్గించుకోవాలని కంపెనీ చూస్తున్నట్టు మరో వ్యక్తి చెప్పారు.
ఓయో ఉద్యోగుల సగటు జీతాలు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్యలో ఉంటాయి. దీంతో వందల కోట్ల కొద్దీ మనీ కంపెనీకి సేవ్ అవుతుంది. సేల్స్, సప్లయి టీమ్స్‌లో చాలా ఎక్కువ మంది ఉద్యోగులున్నారు. కార్పొరేట్ ఆఫీసులో కూడా ఉద్యోగులను తీసివేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రతి బ్రాంచ్‌లోనూ 8 నుంచి 10 మంది వ్యక్తులను మాత్రమే సేల్స్ టీమ్‌గా ఉంచాలనుకుంటోంది. ముంబైలోనే సేల్స్ టీమ్‌లో 180 మంది ఉన్నారు. వారిలో 120 మందిని ఇప్పటికే కంపెనీ తీసేసింది. 2019 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ నికర నష్టాలు బాగా పెరిగాయి. ఆపరేటింగ్, ఉద్యోగి ప్రయోజనాల ఖర్చులు పెరగడంతో, ఓయోకు నష్టాలు తడిసి మోపడవుతున్నాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ప్రొవిజనల్ నికర నష్టం రూ.2,384.69 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఏడాది ఇది రూ.360.43 కోట్లుగా ఉంది. తీసివేసే ఉద్యోగులకు కంపెనీ ఒక నెల నోటీసు పిరియడ్ కూడా ఇస్తోంది.
