- భయంతో స్కూళ్లకు పరుగులు తీసిన తల్లిదండ్రులు
- బాంబు డిటెక్షన్ టీమ్‌లతో రంగంలోకి పోలీసులు
- తనిఖీల అనంతరం పేలుడు పదార్థాలు దొరకలేదని వెల్లడి
న్యూఢిల్లీ : ఢిల్లీలోని దాదాపు 40 స్కూళ్లకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. స్కూల్ యాజమాన్యాలను నిందితులు 30 వేల డాలర్లు(రూ.25 లక్షలు) డిమాండ్ చేశారు. ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ్ విహార్‌లోని జీడీ గోయెంకా స్కూల్, చాణక్యపురిలోని బ్రిటిష్ స్కూల్, అరబిందో మార్గ్‌లోని ది మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్, మండి హౌస్‌లోని మోడ్రన్ స్కూల్, వసంత్ కుంజ్‌లోని
ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సఫ్దర్‌జంగ్‌లోని ఢిల్లీ పోలీస్ పబ్లిక్ స్కూల్, కైలాష్ అండ్ సాల్వాన్ పబ్లిక్ స్కూల్స్ సహా ఢిల్లీ సిటీలోని పలు ప్రముఖ స్కూళ్లకు ఒకేరకమైన బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు వెంటనే క్లాసెస్ నిలిపివేసి, స్టూడెంట్లను ఇంటికి పంపించి పోలీసులకు సమాచారం అందించాయి.
పేలుడు పదార్థాలేమీ లేవు
రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబు డిటెక్షన్ టీమ్‌లు, డాగ్ స్క్వాడ్ లు, ఫైర్ ఇంజన్లతో ఆయా స్కూళ్లకు వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదని పోలీసులు వెల్లడించారు. మెయిల్స్ వచ్చిన ఐపీ అడ్రెస్‌ను గుర్తించేందుకు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ్ విహార్ లోని జీడీ గోయెంకా స్కూల్ కు సోమవారం ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయన్నారు.
మరికొన్ని స్కూళ్లకు ఆదివారం అర్ధరాత్రే మెయిల్స్ వచ్చినట్లు గుర్తించామన్నారు. బాంబులను గుర్తించలేని ప్లేస్‌లలో పెట్టామని నిందితులు పేర్కొన్నారని పోలీసులు చెప్పారు. అవి పేలితే చాలామంది అవయవాలు కోల్పోయే ప్రమాదం ఉందని బెదిరించారన్నారు. బాంబులు పేలకుండా చేసేందుకు 30 వేల డాలర్లు ఇవ్వాలని అడిగినట్లు చెప్పారు.
తల్లిదండ్రుల్లో భయాందోళన
ఒకేసారి 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం.. స్కూల్స్ మూసేసి, పిల్లల్ని ఇండ్లకు పంపడంతో ఢిల్లీలో గందర గోళం నెలకొంది. న్యూస్ వేగంగా వ్యాప్తి చెందడంతో పేరెంట్స్ భయాందోళనకు గురయ్యారు. తమ పిల్లల కోసం స్కూళ్లకు చేరుకున్నారు. స్కూళ్లకు బాంబు బెదిరింపులపై ఢిల్లీ సర్కార్ ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ వాసులకు భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించింది. ఢిల్లీలో శాంతిభద్రతలు రోజురోజుకూ అధ్వానంగా మారుతున్నాయని ఆప్ చీఫ్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ విమర్శించారు.
ఆగ్రా ఎయిర్‌పోర్టుకూ బెదిరింపులు
యూపీలోని ఆగ్రా ఎయిర్‌పోర్టుకు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఎయిర్‌పోర్టు మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు.. పేలుడు పదార్థాలు ఏమీ దొరకలేదని వెల్లడించారు. సోమవారం ఉదయం 11:56 గంటలకు ఆగ్రా ఎయిర్ పోర్ట్‌లోని బాత్‌రూమ్‌లో బాంబు పెట్టినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ మేనేజర్ కు మెయిల్ వచ్చిందన్నారు. సోదాల్లో అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదని చెప్పారు.