- హత్య కేసులో జైలు శిక్ష
- తప్పించుకునేందుకు వ్యక్తి ప్లాన్
- ఘజియాబాద్‌లో ఘటన.. విచారణలో గుట్టురట్టు
న్యూఢిల్లీ: కూతురు హత్య కేసులో జైలుకెళ్లి, పెరోల్‌పై బయటికొచ్చిండు.. మళ్లీ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు ఇంకో వ్యక్తిని చంపి, తనే చనిపోయానని నమ్మించే ప్రయత్నం చేసిండో ఖైదీ! పోలీసుల విచారణలో నిజం బయటపడడంతో మళ్లీ కటకటాలపాలయిండు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. ఘజియాబాద్ సిటీలోని లోనె ఏరియాకు చెందిన సుదేశ్ కుమార్హత్యానేరంపైన జైలుకెళ్లిండు. 2018లో సుదేశ్ తన 13 ఏండ్ల కూతురిని చంపాడని పోలీసులు ఆరోపించారు. కేసు కోర్టు విచారణలో ఉంది. అయితే, కరోనా కారణంగా రిమాండ్ ఖైదీలను అధికారులు పెరోల్‌పై బయటకు పంపారు. అట్లా బయటకు వచ్చిన సుదేశ్.. మళ్లీ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు తను చనిపోయినట్లు నమ్మించాలనుకున్నడు. తన ప్లేసులో వేరే వ్యక్తి డెడ్‌బాడీని చూపెట్టి, చట్టం నుంచి తప్పించుకోవాలని చూసిండు.
ప్లాన్ ప్రకారం తన హైటు, వెయిటుకు సరిపోయిన డోమన్ రవిదాస్‌ను ఎంచుకున్నడు. అడ్డాకూలీగా పనిచేసే రవిదాస్‌ను తన ఇంట్లో రిపేర్ వర్క్ చేయాలని పిలిచి, మందు తాగించి చంపేసిండు. తర్వాత ముఖాన్ని గుర్తుపట్టకుండా కాల్చేసి, శవాన్ని ఓ ఖాళీ ప్రదేశంలో పారేసిండు. డెడ్‌బాడీకి తన బట్టలు తొడగడంతో పాటు తన ఆధార్ కార్డును అక్కడే పడేసిండు. పోలీసులు ఆ ఆధార్ కార్డ్ సాయంతో ఇంటికి రావడంతో సుదేశ్ భార్య ఆ డెడ్‌బాడీ తన భర్తదేనని చెప్పింది. అయితే, ఆమె చెప్పేదానికి అక్కడ జరిగిన దానికీ పొంతనలేకపోవడం, సుదేశ్ బతికే ఉన్నాడని ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు మరింత లోతుగా విచారించారు. దీంతో భార్యాభర్తల ప్లాన్ బయటపడింది. తర్వాత భార్యను కలుసుకోవడానికి వచ్చిన సుదేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవిదాస్ డెడ్‌బాడీని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు.
