రూపాయికి రెక్కలొచ్చాయ్…!

రూపాయికి రెక్కలొచ్చాయ్…!

యుఎస్​లోని ఎన్నారైలు డాలర్లు,  గల్ఫ్​లోని కార్మికులు దీనార్లు పంపడం సంగతేమో గానీ, మన డబ్బుమాత్రం విదేశాలకు వెళ్లిపోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది జూలైలో మన రూపాయి దేశం దాటింది. దీనికి ముఖ్య కారణం 2004లో ప్రవేశపెట్టిన లిబరలైజ్డ్​ రెమిటెన్స్​ స్కీమ్​(ఎల్​ఆర్​ఎస్​). యూపీఏ–2 సర్కార్​లో ఎల్​ఆర్​ఎస్​ కింద మొత్తం 5.4 బిలియన్​ డాలర్ల రొక్కం ఇక్కడి నుంచి ఇతర దేశాలకు చేరగా, ప్రస్తుత ఫైనాన్షియల్​ ఇయర్​ తొలి నాలుగు నెలల్లోనే 5.8 మిలియన్​ డాలర్లను మించిపోయింది.

విదేశాల్లో ఎడ్యుకేషన్​, టూరిజం, వైద్యం వంటి అవసరాలకోసం గతంలో ఫండ్స్​ తీసుకెళ్లాలంటే చాలా ఆంక్షలు ఉండేవి. మన్మోహన్​ సింగ్​ 2004లో ఫస్ట్​ టర్మ్ అధికారంలోకి రాగానే తన రిఫార్మ్స్​ని మరికొన్నిటికి విస్తరించారు. అందులో భాగంగా తెచ్చినదే ‘లిబరలైజ్డ్​ రెమిటెన్స్​ స్కీమ్​ (ఎల్​ఆర్​ఎస్​)’. ఈ స్కీమ్​ కింద ఏటా రెండున్నర లక్షల  డాలర్ల వరకు అమౌంట్​ పంపొచ్చు. మైనర్లు సహా రెసిడెంట్​ ఇండియన్లు​ (ఇండివిడ్యువల్స్​) అందరూ ఫారిన్​లో పర్మిషన్​ గల ఏదైనా కరెంట్​ అకౌంట్​కి లేదా కేపిటల్​ అకౌంట్​కి ఇంత మొత్తంతో ట్రాన్సాక్షన్స్​ చేయొచ్చు. విదేశాల్లోని కుటుంబ సభ్యులకు ఇండియా నుంచి గిఫ్ట్​ రూపంలో కూడా మనీ ట్రాన్స్​ఫర్స్​ చేయొచ్చు. కరెంట్​ అకౌంట్ ​బ్యాలెన్స్​ను…  దగ్గరి బంధువుల ఖర్చులు భరించడానికి, ప్రయాణాలకు, చదువుకు, మెడికల్​ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

కేపిటల్​ అకౌంట్​లోని సొమ్మును… విదేశం​లోని ఏదైనా బ్యాంక్​లో ఫారిన్​ కరెన్సీ అకౌంట్​​ ఓపెన్​ చేయటానికి, ఆస్తులు కొనటానికి; మ్యూచువల్స్​ ఫండ్స్​, వెంచర్​ కేపిటల్​ ఫండ్స్​లో పెట్టుబడికి వాడుకోవచ్చు. దీంతో మన దేశం నుంచి వేరే దేశాలకు జరుగుతున్న రెమిటెన్స్​ (చెల్లింపులు) గడిచిన పదేళ్లలో ఊహించని రీతిలో పెరిగిపోయాయి. 2009–14 మధ్య కాలంలో ఈ లావాదేవీలు 500 కోట్ల డాలర్లు మాత్రమే కాగా, 2016లో ఒక్క ఏడాదిలోనే 460 కోట్ల డాలర్ల మార్క్​ చేరుకున్నాయి.

మోడీ ప్రధాని అయిన తర్వాత తొలి రెండేళ్లలో ఈ ట్రాన్సాక్షన్స్​ నూరుశాతాన్ని మించిపోయాయి. 2018లో 1100 కోట్ల డాలర్లు, 2019లో 1307 కోట్ల డాలర్లు ఎల్​ఆర్​ఎస్​ ద్వారా ఎల్లలు దాటాయి. విదేశాల నుంచి మన దేశానికి ఫారిన్​ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్ (ఎఫ్డీఐ)​లను​, పోర్ట్​ఫోలియో పెట్టుబడులను ఆకర్షించాలని కేంద్రం ఆశిస్తున్న నేపథ్యంలో… వాస్తవ పరిస్థితులు రివర్స్​లో ఉండటం ఆలోచించాల్సిన విషయమేనని, ఇండియా ఎంతో కష్టపడి సంపాదించిన ఫారెక్స్​ నిల్వలు తగ్గిపోతాయని  ఎకనామిస్టులు, అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

దేనికెంత ఖర్చు చేశారు?

ఇండియా నుంచి ఇతర దేశాలకు పంపిన డబ్బును ఏ ఖర్చులకు వాడారనే విషయమై రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఆర్​బీఐ) డేటా విడుదల చేసింది. దాని ప్రకారం ట్రావెల్​ కోసం 1,400 కోట్ల డాలర్లకు పైగా ఖర్చయ్యాయి. క్లోజ్​ రిలేటివ్స్​ని మెయింటైన్​ చేయటానికి 1,000 కోట్ల​ డాలర్ల పైచిలుకు వాడారు. మరో 1,000 కోట్ల డాలర్లను చదువుకి​ ఖర్చు పెట్టారు. గిఫ్ట్​ల ఖాతాలో 408 కోట్ల​ డాలర్లు వేశారు. స్థిరాస్తుల కొనుగోలుకి 40 కోట్ల​ డాలర్లు; ఈక్విటీల్లో ఇన్వెస్ట్​మెంట్​, అప్పులకు 109 కోట్ల​ డాలర్లు ఇచ్చారు.

బయటి దేశాల్లో కంపెనీలు

విదేశాల్లో కంపెనీలను ఏర్పాటు చేయడానికి వెళ్తున్నవారిలో ఇండియన్స్​ ఎక్కువగా ఉంటున్నారని గ్లోబల్​ స్ట్రాటజిస్ట్​ రుచిర్​ శర్మ లెక్కలు తీశారు.  2017లో 2.1 శాతం సంపన్నులు​ ఇండియాని విడిచివెళ్లారు.  ఈ సంఖ్య ఫ్రాన్స్​, చైనాల కన్నా ఎక్కువ కావటం షాక్​కు గురి చేస్తోంది. ఫ్రాన్స్​ నుంచి 1.3 శాతం మంది, చైనా నుంచి 1.1 శాతం మంది మాత్రమే తరలివెళ్లారని మోర్గాన్​ స్టాన్లీ టీమ్​ చేసిన స్టడీలో తేలింది. ఎల్​ఆర్​ఎస్ వల్ల పెట్టుబడులు సరి‘హద్దులు’ దాటుతున్నాయనే థియరీని శర్మ బలంగా ప్రపోజ్​ చేస్తున్నారు.

రెమిటెన్స్ పెరిగితే నష్టమేంటి?

ఇండియా నుంచి విదేశాలకు బదలాయింపు పెరగటం ప్రధానంగా మూడు పరిణామాలకు దారి తీస్తుందని ఎకనామిస్టులు చెబుతున్నారు. తప్పుడు లెక్కలు: వేరే దేశాలకు పంపిన డబ్బును ఎక్కువగా ట్రావెల్​ కేటగిరీలో చూపారు. కానీ ఆ రేంజ్​లో జర్నీలు జరగలేదు. ఈ విషయాన్ని స్పార్క్​ కేపిటల్​ 2018 రిపోర్ట్​లో చెప్పింది. దీన్నిబట్టి మన డబ్బుకి తప్పుడు లెక్కలు చూపి పొలిమేరలు దాటిస్తున్నారనే టాక్​ వినిపిస్తోంది. ఒక వ్యక్తి రెమిట్​ చేసే లిమిట్​ 2014 దాక ఏడాదికి లక్షా పాతిక వేల డాలర్ల వరకే ఉంది. దాన్ని రెండున్నర లక్షలకు పెంచారు. కానీ, ట్రాన్సాక్షన్స్ ఆ పరిమితులను మించిపోయినట్లు మల్టిపుల్​ రీసెర్చ్​ బ్రోకరేజీలు గుర్తించాయి.

పెట్టుబడులకు రెక్కలు: ఎల్​ఆర్​ఎస్​ కింద ఫండ్ ఔట్​ఫ్లో పెరగటమనేది మన దేశంలో పెట్టుబడులకు దెబ్బ. విదేశాల్లో పెట్టుబడులు పెరుగుతాయనడానికి గుర్తుగా ఫండ్​ మేనేజర్లు, ఇన్వెస్ట్​మెంట్​ ఎక్స్​పర్ట్​లు చెబుతున్నారు. చిన్న, మధ్య రకం వ్యాపారులు వివిధ కారణాల వల్ల తమ బిజినెస్​ను సింగపూర్​ లేదా దుబాయ్​ వంటి దేశాల్లో పెట్టడంకోసం ఇండియాను విడిచి వెళ్లిపోతున్నారని కూడా అనుకోవచ్చని చెబుతున్నారు. ఈ థియరీని మోర్గాన్​ స్టాన్లీ చీఫ్​ గ్లోబల్​ స్ట్రాటజిస్ట్​ రుచిర్​ శర్మ,  అవెండస్ వెల్త్​ మేనేజ్​మెంట్​ ప్రైవేట్​ లిమిటెడ్​ చైర్మన్​ జార్జ్​ మిత్ర గట్టిగా నమ్ముతున్నారు.

ట్యాక్స్ నుంచి​ తప్పించుకోవటం : ఇండియాలో ట్యాక్స్​లు తప్పించుకోడానికే రెమిటెన్స్​ బాగా జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎల్​ఆర్​ఎస్​ రూట్​లో జరుగుతున్న రెమిటెన్స్​ని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా భూతద్దం పెట్టి పరిశీలిస్తోందంటూ 2015లోనే వార్తలు వచ్చాయి. ట్యాక్స్​ పేయర్లు తమ డబ్బును గిఫ్ట్​ల రూపంలో ఇతర దేశాలకు పంపుతున్నారని బ్లాక్​ మనీపై ఏర్పాటైన స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీమ్​ (సిట్) రీసెంట్​గా రిపోర్ట్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ అమౌంట్… గడచిన ఐదేళ్లలో 500 కోట్ల డాలర్లకుపైగానే ఉంటుందని అంచనా.