IND Vs NZ, 1st Test: కోహ్లీని డకౌట్ చేశాడు.. భారత్‌ను బెంబేలెత్తించాడు.. ఎవరీ 23 ఏళ్ళ కివీస్ బౌలర్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ కు చెందిన  23 ఏళ్ళ యువ ఫాస్ట్ బౌలర్ సొంతగడ్డపై భారత్ కు చుక్కలు చూపించాడు. తన పదునైన పేస్ తో అల్లకల్లోలం చేశాడు. స్టార్ బ్యాటర్లున్న మన జట్టును బెంబేలెత్తించాడు. ఊహించని షాక్ ఇస్తూ టీమిండియాను 46 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో కీలక పాత్ర పోషించాడు. ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. అతడే న్యూజిలాండ్ యువ సంచలనం విలియం ఒరోర్కే.  

భారత్ లాంటి ఛాలెంజింగ్ గడ్డపై తొలి సారి అడుగుపెట్టిన న్యూజిలాండ్ యువ పేసర్ విలియం ఒరోర్కే భారత బ్యాటర్లను ఒక ఆట ఆడుకుంటూ 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ వైపు పరుగులని నియంత్రిస్తూనే మరోవైపు వికెట్లు పడగొట్టాడు. కోహ్లీని డకౌట్ చేసి తొలి వికెట్ తీసిన అతను..జైశ్వాల్, రాహుల్, బుమ్రా వికెట్లను పడగొట్టాడు. మరో ఎండ్ లో సీనియర్ ఫాస్ట్ బౌలర్ హెన్రీ 5 వికెట్లతో చెలరేగడంతో భారత్ 46 పరుగులకే ఆలౌటైంది. 

Also Read:-46 పరుగులకు ఆలౌట్.. ఐదుగురు డకౌట్

హెన్రీ, సౌథీ లాంటి స్టార్ ఔలర్లు వికెట్లు తీయడంలో ఆశ్చర్యం లేకపోయినా ఒరోర్కే లాంటి యువ బౌలర్ భారత గడ్డపై తొలిసారి అడుగుపెట్టి తొలి మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు తీయడం ఖచ్చితంగా గ్రేట్ అని చెప్పాలి. ఇటీవలే శ్రీలంక సిరీస్ లో మెరుగ్గా రాణించిన ఈ యువ పేసర్ ను భారత్ తో సిరీస్ కు ఎంపిక చేయడమే కాక తుది జట్టులో అవకాశం ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని రెండు సద్వినియోగం చేసుకొని భారత్ కు పీడకలలా మారాడు. ఇప్పటివరకు 5 టెస్టుల్లో 2 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు.