స్ట్రీట్ డాగ్స్​కు లైఫిద్దాం

  • అడాప్షన్​ క్యాంపులు నిర్వహిస్తున్న తెలంగాణ పెట్ అడాప్షన్​ సంస్థ
  • ప్రతి సండే నేరెడ్​మెట్​లో క్యాంప్ 
  • ఇండియన్ ​బ్రీడ్​ ప్రమోట్​చేయడమే లక్ష్యం

హైదరాబాద్ సిటీ, వెలుగు :  స్ట్రీట్ డాగ్స్​కు మంచి లైఫ్​ఇస్తున్నారు తెలంగాణ పెట్ అడాప్షన్​సంస్థ నిర్వాహకులు. నేరెడ్ మెట్​లో ప్రతి ఆదివారం స్ట్రీట్​డాగ్​అడాప్షన్​క్యాంప్​నిర్వహించి సుమారు 20 వరకు కుక్కలను దత్తతకు ఇస్తున్నారు. ఇంతటితో ఆగకుండా వాటి బాగోగులు కూడా తెలుసుకుంటున్నారు. తొమ్మిదేండ్లలో15 వేలకు పైగా వీధికుక్కలను దత్తత ఇచ్చిన ఈ సంస్థ తమ వల్ల వీధుల్లో కుక్కల సంఖ్య తగ్గిందని చెబుతోంది. ఇతర బ్రీడ్​డాగ్స్​లెక్కనే  స్ట్రీట్ డాగ్స్, పప్పీస్​ ను ట్రీట్ చేయాలని, మన స్ట్రీట్​డాగ్స్​పట్ల ఉన్న చులకన భావం తొలగించుకోవాలని జంతు ప్రియులను కోరుతోంది. 

రిజిస్టరయినవాళ్లే తీసుకొస్తరు 

తెలంగాణ పెట్ అడాప్షన్​సంస్థలో రిజిస్టరయిన డాగ్​లవర్స్, డాగ్​ఫీడర్స్​తీసుకువచ్చే స్ట్రీట్ డాగ్స్, పప్పీస్​ను మాత్రమే దత్తతకు ఇస్తుంది. డాగ్​లవర్స్, ఫీడర్స్​కాలనీలు, వీధుల్లో కుక్కలను, కుక్క పిల్లలను రెస్క్యూ చేసి కొన్ని రోజులు ఫీడింగ్​ ఇచ్చి తర్వాత తీసుకువచ్చి నేరెడ్​ మెట్​లో జరిగే అడాప్షన్​క్యాంపులో పెడతారు. ఒకవేళ వాటిని ఆ రోజు ఎవరూ అడాప్ట్​చేసుకోకపోతే మరో వారం దాక ఫీడర్సే చూసుకొని మళ్లీ క్యాంపునకు తీసుకువస్తారు. ఇలా ప్రతివారం జరుగుతూనే ఉంటుంది. 

ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వరు 

వీధికుక్కలు కదా.. ఎవరికి పడితే వాళ్లకు కుక్కలను ఇస్తారనుకుంటే పొరపాటు పడినట్టే.. తీసుకునేవాళ్లు  చూసుకోగలుగుతారా లేదా అన్నది తెలుసుకోవడం కోసం కొన్ని స్క్రీనింగ్ టెస్టులు పెడతారు. అడాప్షన్​ తీసుకోవడానికి వచ్చే వ్యక్తికి, అతడి కుటుంబానికి మూడు రౌండ్ల కౌన్సిలింగ్​నిర్వహిస్తారు. అడ్రస్, ఐడీ ప్రూఫ్ తీసుకొని వాక్సినేషన్​ చేసిన డాగ్స్, పప్పీస్​ను దత్తతకు ఇస్తారు. 6 నుంచి 8 నెలల వయసున్న వాటికి స్టెరిలైజేషన్​కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేరెడ్​మెంట్​లో మాత్రమే క్యాంపు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో సిటీలోని ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తామని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.

అలాంటి వారు హింసకు మద్దతు ఇస్తున్నట్టే..

ల్యాబ్, జర్మన్​ షెఫర్డ్​ అని రకరకాల బ్రీడ్​డాగ్స్​ను వేలు, లక్షలు పెట్టి కొంటున్నారు. బ్రీడ్​డాగ్​ను ఎక్కువ పిల్లల్ని కనడానికి అశాస్త్రీయ పద్ధతిలో దాన్ని హింసిస్తుంటారు. అలాంటి కుక్క పిల్లలను అడాప్ట్​ చేసుకునేవారు పరోక్షంగా హింసకు మద్దతు ఇస్తున్నట్టే. అందుకే మన వీధుల్లో పెరిగే స్ట్రీట్​డాగ్స్​ను ప్రమోట్​ చేయాలని, వాటికి మంచి లైఫ్​ఇద్దామనే ఉద్దేశంతోనే అడాప్షన్​కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మిగతా బ్రీడ్​డాగ్స్​లాగే... మన ఇండియన్​డాగ్స్​ను కూడా ట్రీట్​చేయాలని రిక్వెస్ట్​చేస్తున్నా.  – డాక్టర్.వసీల్​, మెంబర్, తెలంగాణ పెట్ అడాప్షన్