జులై 18న జరగబోయే రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు సిద్ధాంతాల మధ్య పోటీ అని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనలు, విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ విజ్ఞప్తి చేశారు.
ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ఉంటుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంటుంది. ఎంపీలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు తమ రాష్ర్టాల అసెంబ్లీల్లో ఓటు వేయవచ్చని, అయితే ఎంపీలు కనీసం 10 రోజులు ముందుగా సమాచారం ఇచ్చి దేశంలో మరెక్కడైనా (ఏ అసెంబ్లీలోనైనా) ఓటు హక్కు వినియోగించుకోవచ్చని భారత చీఫ్ఎలక్షన్ కమిషనర్రాజీవ్ కుమార్ చెప్పారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో దేశంలోని అన్ని రాష్ట్రాల శాసన సభ్యులు, లోక్ సభ, రాజ్య సభ ఎంపీలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది.
పార్లమెంటు, ఆయా రాష్ట్రాల శాసనసభల్లో పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ అనంతరం అన్ని బ్యాలెట్ బాక్సులను పార్లమెంటుకు తరలించాల్సి ఉంటుంది. అక్కడే 21వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టొరల్ కాలేజీలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు.. మొత్తం 4,809 మంది ఓటర్లు ఉంటారు. వీరిలో ఎంపీలు 776 మంది (లోక్‌సభ 543+రాజ్యసభ 233).. ఎమ్మెల్యేల సంఖ్య 4,033. ఇటు ఎన్ డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలో ఉన్న విషయం తెలిసిందే.
