న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరుపై కేంద్రం భగ్గుమంది. విపక్షాల నిర్లక్ష్య వైఖరి వల్లే సభలు వాయిదా పడ్డాయని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ మండిపడ్డారు. విపక్ష ఎంపీలు కొంతమంది చైర్మన్ పోడియం ముందు బల్లలు ఎక్కి నినాదాలు చేయడం, పేపర్లు విసిరేయడంపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు డ్రామా చేస్తున్నాయని పీయూష్ గోయల్ ఫైర్ అయ్యారు.
‘పార్లమెంట్ సెక్యూరిటీలో లేని బయటి వారిని తీసుకొచ్చి మార్షల్స్‌లో పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది పూర్తిగా అవాస్తవం. ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయి. పార్లమెంట్‌లో 12 మంది మహిళా, 18 మంది పురుష మార్షల్స్ ఉన్నారు. వాళ్లు బయటి వ్యక్తులు కాదు. ప్రజా సమస్యలపై చర్చించడానికే పార్లమెంట్ ఉంది. కానీ ప్రతిపక్షాలు అరాచకాన్ని తమ ఎజెండాగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది’ అని మరో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. ‘ప్రజలు, పన్నులు కట్టేవారి గురించి ఆలోచించే స్థితిలో వాళ్లు లేరు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతలు వ్యవహరించిన తీరును ఖండించాల్సిందే. మొసలి కన్నీళ్లు కార్చడం కాదు.. ఆ నేతలు దేశానికి క్షమాపణలు చెప్పాలి’ అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు.
