లోక్ సభ, రాజ్య సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్

లోక్ సభ, రాజ్య సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్

న్యూఢిల్లీ: లోక్ సభ సమావేశాలు మొదలైన కాసేపటికే ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. అనంతరం లోక్ సభను స్పీకర్ వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగానే 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయడంతోపాటు లఖీంపూర్ ఖేరీ ఘటనపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. కేంద్రం ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. పన్నెండు మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే రాజ్య సభ చైర్మన్ దీనికి అంగీకరించకపోవడంతో ఇరు సభల నుంచి ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. 

కాగా, గత పార్లమెంట్ సెషన్ లో రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల నిరసనలు శృతి మించాయంటూ నిన్న 12 మంది ఎంపీలను చైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెండ్ చేశారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. సస్పెండ్ అయిన ఎంపీలు క్షమాపణలు చెబితే సభలోకి అనుమతిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. కానీ సారీ చెప్పే ప్రసక్తే లేదని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో స్పష్టం చేశారు. ఎంపీల సస్పెన్షన్ పై స్పీకర్ వెనక్కి తగ్గకపోవడంతో ప్రతిపక్షాలు రాజ్య సభ, లోక్ సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగాయి.