న్యూఢిల్లీ: ఓపెన్ సోర్స్ జర్మన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సూజ్ భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్నది. ఇండియా, జర్మనీలు హై-టెక్నాలజీ రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని చూస్తున్న సమయంలో కంపెనీ ఇప్పటికే బెంగుళూరులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసింది. 30 సంవత్సరాల క్రితం జర్మనీలో స్థాపితమైన సూజ్, ఎంటర్‌ప్రైజ్ లైనక్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చిన మొదటి కంపెనీ. ఇండియాలో ఆర్థిక వృద్ధి, ఇన్నోవేషన్లకు తోడ్పడటానికి ఈ విస్తరణ తమకు కీలకమని సూజ్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మార్కెట్లోకి మరిన్ని ఇన్నోవేషన్లను తీసుకురావడం ద్వారా భారతదేశంలో ఇప్పటికే ఉన్న బలమైన కస్టమర్ బేస్‌ను పెంచుతామని ఆయన అన్నారు. సూజ్ తన మూడు ఇంటర్ కనెక్టెడ్ ప్రొడక్ట్ ఫ్యామిలీస్.. బిజినెస్ క్రిటికల్ లైనక్స్, ఎంటర్‌ప్రైజ్ కంటైనర్ మేనేజ్‌మెంట్, ఎడ్జ్ లతో ఇన్నోవేషన్‌ను నడుపుతోందని చెప్పారు.
విస్తరణలో భాగంగా పెద్ద వర్క్‌ఫోర్స్‌ను నియమించుకోవాలని యోచిస్తోందని ఖాన్ చెప్పారు. కంపెనీ మొత్తం గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో కనీసం 20 శాతం మందిని భారతదేశంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉంచాలనుకుంటున్నామని వివరించారు. ఎస్ఏపీ ల్యాబ్స్ (జర్మన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ) సమీపంలో బెంగళూరులోని ఈపీఐపీ ఇండస్ట్రియల్ ఏరియాలో కొత్త ఆఫీసును ఏర్పాటు చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలో సూజ్ వ్యూహాత్మక పెట్టుబడిని దృష్టిలో ఉంచుకుని దీనిని నిర్మించింది. ఓపెన్ సోర్స్ టెక్నాలజీకి విపరీతంగా ఆదరణ పెరుగుతోందని, ఫార్చ్యూన్–500లో 99 శాతానికి పైగా కంపెనీలు ఇటువంటి ఉత్పత్తులపై ఆధారపడుతున్నాయని ఖాన్ చెప్పారు. భారత ప్రభుత్వం కూడా ఓపెన్ సోర్స్ టెక్నాలజీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని ఇటీవల పేర్కొందన్నారు. ఈ–-గవర్నెన్స్/డిజిటల్ గవర్నెన్స్ అప్లికేషన్స్‌లో వీటిని వాడుతుందని అన్నారు. సూజ్కి భారతదేశంలో మలయాళ మనోరమ, జేకే టైర్, కేరళ పోలీస్, ఇండియన్ ఆయిల్, మ్యాన్‌కైండ్ ఫార్మా వంటి కంపెనీలతో కూడిన కస్టమర్ బేస్ ఉంది.
