వనపర్తి జిల్లాలో ఆన్​లైన్​ మోసం .. రూ.కోట్లలో నష్టపోయిన బాధితులు

వనపర్తి, వెలుగు: వాట్సప్​ ద్వారా వచ్చిన ఆన్​లైన్​ మనీ సర్క్యూలేషన్​ యాప్​లో డబ్బులు పెట్టిన వారికి కొన్ని రోజులు రెగ్యులర్​గా డబ్బులు పంపిన నిర్వాహకులు ఆ తరువాత డేంజర్​ మెసేజ్​ పంపారు. అప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించిన బాధితులు మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి యువకులు ఆన్​లైన్​ ద్వారా డబ్బులు చెల్లించారు. ఇలా దాదాపు రూ.50 కోట్ల దాకా చెల్లించి ఉంటారని సమాచారం. ఒకసారి రూ.1200 చెల్లిస్తే రోజూ రూ.84 చొప్పున 50 రోజుల పాటు రూ.4,200 తిరిగి ఇస్తామని చెప్పి క్రమం తప్పకుండా రోజువారీగా డబ్బులు వేశారు.

దీంతో నిర్వాహకులను నమ్మిన ప్రజలు వారు అడిగినంత డబ్బులు చెల్లిస్తూ వచ్చారు. ఇలా ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఆన్​లైన్​లో డబ్బులు చెల్లించారు. ఇలా పెద్దమందడి మండలం జగత్​పల్లి గ్రామంలో దాదాపు 80 మంది యువకులు రూ.3 కోట్ల వరకు చెల్లించారు.  వనపర్తి మండలం కడుకుంట్ల, పెద్దగూడెంతండా తదితర గ్రామాల్లో 200 మంది రూ.4 కోట్ల వరకు జమ చేశారు.

రెండు రోజులుగా యాప్​ పని చేయకపోగా, సోమవారం యాప్​లో స్పందించిన సైబర్​ నేరగాళ్లు రూ.5,774 జమ చేస్తే యాప్​ పని చేస్తుందని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే రూ.వేలల్లో నష్టపోయిన బాధితుల్లో  కొందరు వారడిగినట్లు డబ్బులు వేయగా, చాలా మంది వేయలేదు. బాధితుల్లో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే, మరికొందరు పరువు పోతుందని ముందుకు రావడంలేదు.