అక్టోబర్ 23 నుంచి టీశాట్​లో పోటీ పరీక్షలకు క్లాసులు : సీఈవో వేణుగోపాల్ రెడ్డి

  • ఎస్ఎస్​సీ భర్తీ చేసే పోస్టులకు ఆన్​లైన్ కోచింగ్

హైదరాబాద్, వెలుగు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్​సీ) భర్తీ చేసే పోటీ పరీక్షలకు ఆన్​లైన్​లో కోచింగ్​ అందిస్తామని టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం నుంచి 2025, జనవరి 31 వరకు టీశాట్ నెట్​వర్క్ చానెళ్లలో క్లాసులు నిర్వహిస్తామని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. 39,481 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఎస్ఎస్​సీ సెప్టెంబర్ 6న నోటిఫికేషన్ విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇందులో తెలంగాణ నుంచి 718 మందికి, ఏపీ నుంచి 908 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.

 ఈ నేపథ్యంలోనే టీశాట్ ప్రత్యేక పాఠ్యాంశాలతో ప్రణాళికను రూపొందించిందని, ఆన్​లైన్​లో నాణ్యమైన కంటెంట్ ఇస్తున్నామని వివరించారు. 112 రోజుల పాటు సాగే ఆన్​లైన్ క్లాసుల ద్వారా 448 ఎపిసోడ్​లలో 224 గంటల క్లాసులను నెట్​వర్క్ చానెళ్లు, యూట్యూబ్, యాప్ ద్వారా ప్రసారం చేస్తామన్నారు.. క్లాసులు టీశాట్ నిపుణ చానెల్​లో ప్రతి సోమవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు, విద్య చానెల్​లో మరుసటి రోజు ఉదయం 5 నుంచి 7 గంటల వరకు ప్రసారం అవుతాయని వివరించారు. కాగా, నవంబర్ 17న టీజీపీఎస్సీ నిర్వహించనున్న 1,388 గ్రూప్ 3 పోస్టుల పోటీ పరీక్షలకు కంటెంట్​ను మరో రెండు గంటలు అదనంగా అందించనున్నామని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.