ఉల్లిగడ్డ రూ 80 .. పది రోజుల్లో సెంచరీ కొట్టొచ్చంటున్న వ్యాపారులు

  • రాబోయే రెండు మూడు నెలలూ ఇదే పరిస్థితి
  • గతేడాది ధరలు లేక.. ఈ సారి సాగుకు దూరంగా రైతులు
  • కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి దిగుమతి 
  • మార్కెట్​లో రేటున్నా..రైతుకు దక్కుతున్నది సగమే!

మహబూబ్​నగర్, వెలుగు: ఉల్లిగడ్డ రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారం కింద కిలో రూ.30 నుంచి రూ.40 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వరకు ఉన్న ఉల్లిగడ్డ  ఇప్పుడు రూ.75 నుంచి రూ.80కు చేరింది. మరో వారంలో కిలో రూ.100కు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్​కు పంట వచ్చే మార్చి వరకు రేట్లు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.

 గత ఏడాది రాష్ట్రంలో ఉల్లి దిగుబడి బాగా వచ్చింది. దానికి తోడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోటెత్తింది. దీంతో రేటు బాగా పడిపోయింది. సీజన్​లో క్వింటా ఉల్లిగడ్డ కేవలం రూ.1,200 నుంచి రూ.1,500 మధ్య పలికింది. మంచి దిగుబడి వచ్చినా రేటు రాకపోవడంతో ఈ ఏడాది రైతులు ఉల్లిగడ్డ సాగుకు వెనుకడుగు వేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ సారి మార్కెట్​కు ఉల్లిగడ్డ రావడం గణనీయంగా తగ్గింది. అవసరం మేరకు ఉల్లిగడ్డ రాకపోవడంతో డిమాండ్​ ఏర్పడి రేట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారం క్రితం వరకు రూ.40లోపే ఉన్న కిలో ఉల్లిగడ్డ.. ఇప్పుడు రూ.50 నుంచి రూ.80 వరకు చేరింది. 

రైతులకు దక్కేది తక్కువే..

మార్చి తర్వాతే కొత్త గడ్డ మార్కెట్​కు వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు అక్కడక్కడ  రైతులు కొద్ది మొత్తంలో సాగు చేసిన ఉల్లి మార్కెట్​కు వస్తున్నది. దీన్ని వ్యాపారులు ఎగబడి కొంటున్నారు. నిజానికి రైతుల నుంచి వ్యాపారులు కేవలం క్వింటా​కు రూ.5,500 నుంచి రూ.5,800 వరకు చెల్లిస్తున్నారు. ఆ పంటను హోల్​సేల్​ వ్యాపారులకు రూ.6,500 నుంచి రూ.7 వేల వరకు అమ్ముతున్నారు. 

హోల్​సేల్​ వ్యాపారులు రిటైల్​ వ్యాపారులకు రూ.7,500 నుంచి రూ.8 వేలకు విక్రయిస్తున్నారు. ఇలా ముగ్గురి చేతులు మారాక కష్టమర్లకు చేరుతుండడంతో కూడా రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. రానున్న వారం, పది రోజుల్లో కిలో ఉల్లి గడ్డ రేటు వంద రూపాయలు తాకే అవకాశం ఉంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా ఇవే రేట్లు కొనసాగుతాయని అంటున్నారు. యాసంగిలో సాగు చేసిన ఉల్లి దిగుబడులు మార్చి మొదటి వారం నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాతే రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నది. 

పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి

ప్రస్తుతం రాష్ట్రంలో ఉల్లిగడ్డకు కొరత ఏర్పడడంతో వ్యాపారులు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎక్కువగా ఎర్ర ఉల్లి గడ్డ వేస్తారు. అక్కడి రైతులకు క్వింటాల్​కు రూ.2 వేల నుంచి రూ.3 వేల మధ్య చెల్లించి వ్యాపారులు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో మాత్రం హోల్​సేల్ గా క్వింటా రూ.ఐదు వేల నుంచి రూ.ఆరు వేల వరకు అమ్ముతున్నారు. ఇది రిటైల్ వ్యాపారులకు, అక్కడి నుంచి కష్టమర్లకు చేరేవరకు రూ.75 నుంచి రూ.80 వరకు చేరుకుంటున్నది.

సాగు తగ్గడం వల్లే..

నిరుడు ఈ టైమ్​కు దేవరకద్ర అగ్రి మార్కెట్​లో ఉల్లిగడ్డ రాసులు ఉండేవి. ఇప్పుడు మొత్తం బోసి పోయింది. నిరుడు రేట్​లేకపోవడంతో రైతులు నష్టపోయి.. ఈ సారి సాగు చేయలేదు. అక్కడక్కడ కొద్దిమొత్తంలో సాగు చేసిన రైతులకు లాభాలు వస్తున్నాయి. డిమాండ్​ఉండడంతో వ్యాపారులు రాయచూర్, కర్నాటక నుంచి ఎర్ర గడ్డను తీసుకొస్తున్నారు. 

సుదర్శన్​ శెట్టి, కమీషన్​ ఏజెంట్, దేవరకద్ర