మరింత పెరిగిన ధరలు… ఉల్లి@రూ.80

మరింత పెరిగిన ధరలు… ఉల్లి@రూ.80

    రెండుమూడు రోజుల దాకా ఇదే పరిస్థితి

    వర్షాలతో కొత్త ఉల్లి స్టాక్‌‌కు ఇబ్బంది

    ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు

ఉల్లి మరింత కొండెక్కేసింది. దేశ రాజధాని, ఇతర ప్రాంతాల్లో ఉల్లి ధరలు కేజీకి రూ.70 నుంచి రూ.80కు పెరిగాయి. ఉల్లి పండే ప్రాంతాల్లో భారీ వర్షాలతో, సప్లయిలో కొరత వల్ల ఈ పరిస్థితి వచ్చింది. స్టాక్ లిమిట్స్‌‌పై ఆంక్షలు విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.  గతవారం ఢిల్లీలో ఉల్లి రిటైల్ ధర కేజీకి రూ.57గా, ముంబైలో రూ.56గా, కోల్‌‌కతాలో కేజీకి రూ.48గా, చెన్నైలో రూ.34గా పలికింది. గూర్గావ్‌‌లో అయితే ఏకంగా కేజీకి రూ.60గా ఉంది. వారం ముగిసే నాటికి ఈ ధరలు రూ.70 నుంచి రూ.80కు చేరుకున్నాయి. సప్లయిను పెంచడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నా.. ఉల్లి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ధరలు పెరగకుండా ఉండేందుకు, దేశీయంగా సప్లయిను పెంచేందుకు ప్రభుత్వం గత కొన్ని వారాల నుంచి పలు చర్యలను ప్రకటిస్తూ వస్తోంది. గత రెండు మూడు రోజుల నుంచి అకస్మాత్తుగా ధరలు మరింత పెరిగాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉల్లి పండే రాష్ట్రాల నుంచి సప్లయి తగ్గిపోవడంతో వీటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పాయి. వచ్చే రెండు మూడు రోజులు కూడా ధరలు ఇలానే పెరుగుతాయని తెలిపాయి. ఉల్లి ట్రేడర్లు స్టాక్‌‌ను ఉంచుకునే స్థాయులపై   ప్రభుత్వం ఆంక్షలు విధించాలని కోరుతున్నారు.

వర్షాలతో ఇబ్బందులు

మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌‌లలో ఉల్లిని ఎక్కువగా పండిస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో పంట నష్టం ఏర్పడింది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో నిల్వ ఉంచిన ఉల్లినే విక్రయిస్తున్నారు. నవంబర్ నుంచి ఖరీఫ్ పంట మార్కెట్‌‌కు వస్తుంది. గతేడాది పంటలకు చెందిన ఉల్లి స్టాక్ సరిపడా ఉందని ఉందని ట్రేడర్లు చెబుతున్నారు. వర్షాలతో రవాణా కష్టమవుతుందన్నారు. ఉల్లి ఎక్కువగా మహారాష్ట్రలో స్టోర్ చేసి ఉంటుంది. కానీ వర్షాల కారణాలతో దాన్ని ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం ఇబ్బంది కరంగా మారిందని మహారాష్ట్రలోని లాసల్‌‌గావ్‌‌ హోల్‌‌సేల్ మార్కెట్‌‌లో  ఓ హోల్‌‌సేల్ ట్రేడర్ చెప్పారు.