హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సాగర్‌కు 77,658 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నాలుగు గేట్లను ఐదు ఫీట్ల మేర ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312 టీఎంసీ)లకు చేరుకుంది. కుడి కాల్వకు 10 వేల క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 3,667, విద్యుత్ ఉత్పత్తికి 29,191, ఎస్‌ఎల్‌బీసీకి 1,800, వరదకాల్వకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నిండు కుండలా ఎస్సారెస్పీ
బాల్కొండ, వెలుగు: ఎగువ నుంచి వచ్చిన వరదతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 27,315 క్యూసెక్కుల వరద వస్తుండడంతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు చేరుకుంది. వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ ద్వారా 19 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాకతీయ కాల్వకు 6,800 క్యూసెక్కులను విడుదల చేస్తుండడంతో పవర్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమైంది. లక్ష్మి కాల్వకు 200, సరస్వతీ కాల్వకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.