అగ్రిచట్టాలు రద్దయ్యేదాకా.. ఊళ్లకు పోనేపోం!

అగ్రిచట్టాలు రద్దయ్యేదాకా.. ఊళ్లకు పోనేపోం!

బార్డర్ ఖాళీ చేయని రైతులు.. స్థానికుల ఆందోళన
కలెక్టర్ అల్టిమేటం ఇచ్చినా.. యూపీ గేట్​ను ఖాళీ చేయని రైతులు 
బీకేయూకు మద్దతుగా యూపీ, హర్యానా నుంచి వేలాది మంది రాక
టిక్రి, సింఘు, ఘాజీపూర్ బార్డర్లు క్లోజ్.. బార్డర్లలో కొనసాగుతున్న టెన్షన్

అగ్రి చట్టాలను రద్దు చేసేవరకూ తాము వెనక్కి వెళ్లిపోయే ప్రసక్తే లేదని ఢిల్లీ బార్డర్లలో నిరసనలు తెలుపుతున్న రైతులు స్పష్టం చేశారు. శుక్రవారం  యూపీ, హర్యానా నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ బార్డర్ల వైపు తరలి రావడంతో పోలీసులు అన్ని బార్డర్లను క్లోజ్ చేశారు. ఘాజీపూర్ లో గురువారం రాత్రి మోహరించిన అదనపు సెక్యూరిటీ బలగాలను అధికారులు వెనక్కి తీసుకున్నారు.  ఇదిలా ఉండగా సింఘు బార్డర్ ను ఖాళీ చేసి వెళ్లాలంటూ రైతులకు వ్యతిరేకంగా లోకల్స్​ ఆందోళనకు దిగారు. ప్రొటెస్టింగ్ సైట్ వైపు రాళ్లు విసిరారు. దీంతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ను ప్రయోగించారు.

న్యూఢిల్లీ:అగ్రి చట్టాలను రద్దు చేసేంతవరకూ తాము వెనక్కి వెళ్లిపోయే ప్రసక్తేలేదని ఢిల్లీ బార్డర్లలో నిరసనలు తెలుపుతున్న రైతులు స్పష్టం చేశారు. శుక్రవారం వేలాది రైతులు ఢిల్లీ బార్డర్ల వైపు తరలి రావడంతో పోలీసులు అన్ని బార్డర్లను క్లోజ్ చేశారు. ప్రధానంగా తిక్రి, సింఘు, ఘాజీపూర్ బార్డర్ల వద్ద టెన్షన్ కొనసాగుతోంది. ఢిల్లీ–– యూపీ బార్డర్ లోని ఘాజీపూర్ వద్ద యూపీ గేట్ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలంటూ గురువారం ఘజియాబాద్ కలెక్టర్ ఇచ్చిన అల్టిమేటంను భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేతలు నరేశ్ తికాయత్, రాకేశ్ తికాయత్ లు తిరస్కరించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన సంఘటనలు, పోలీసుల నిర్బంధాన్ని తలచుకుని రాకేశ్ కంటతడి పెట్టారు. తమకు మద్దతుగా రైతులు తరలిరావాలంటూ పిలుపునిచ్చారు. దీంతో శుక్రవారం హర్యానా, యూపీలోని అనేక ప్రాంతాల నుంచి రైతులు వేలాదిగా ఢిల్లీ బార్డర్లకు వెల్లువెత్తారు.

ముజఫర్ నగర్​లో మహాపంచాయత్

బీకేయూ లీడర్ రాకేశ్ తికాయత్ పిలుపునివ్వడంతో యూపీ గేట్ వద్దకు శుక్రవారం మరో వెయ్యి మంది రైతులు తరలివచ్చారు. ముజఫర్ నగర్ లోని మహావీర్ చౌక్ కు సమీపంలోని జీఐసీ గ్రౌండ్ లో కూడా వేలాది మంది రైతులు ‘మహాపంచాయత్’గా గుమిగూడారు. వెస్టర్న్ యూపీలోని మీరట్, బాఘ్​పట్, బిజ్నోర్, ముజఫర్ నగర్, మొరాదాబాద్, బులంద్ షహర్ నుంచి రైతులు వందలాది ట్రాక్టర్లలో భారీగా తరలివచ్చారు. గురువారం రాత్రి యూపీ గేట్ వద్ద నిరసన ప్రాంతంలో 500 మంది మాత్రమే మిగలగా, శుక్రవారం మళ్లీ రైతుల సంఖ్య వెయ్యికి పైగా పెరిగింది. రాకేశ్ తికాయత్ ఢిల్లీ–మీరట్ ఎక్స్ ప్రెస్ వేపై వేసిన స్టేజ్​పై నిరసన కొనసాగిస్తున్నారు. కాగా, టిక్రి, సింఘు బార్డర్లలో రైతులు నిరసనలు తెలుపుతున్న ప్రాంతాల చుట్టూ శుక్రవారం సెక్యూరిటీ పటిష్టం చేశారు. సింఘు బార్డర్​కు వచ్చే ఎంట్రీ పాయింట్లనూ క్లోజ్ చేశారు. పోలీసులతో సహా పారామిలటరీ బలగాలను
మోహరించారు.

రాళ్లు విసిరిన లోకల్స్

సింఘు బార్డర్ ను ఖాళీ చేసి వెళ్లాలంటూ రైతులకు వ్యతిరేకంగా లోకల్​ ప్రజలు డిమాండ్​ చేశారు.  పోలసులు అడ్డుకున్నా వినకుండా ఆందోళన జరుగుతున్న ప్రాంతంలోకి వెళ్లి, కొన్ని టెంట్లు పీకేశారు. వారిని రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు, లోకల్​ ప్రజలకు వాగ్వాదం జరిగింది. తర్వాత అదికాస్తా గొడవకు దారితీసింది. రెండు వర్గాలు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి టియర్​గ్యాస్​ ప్రయోగించారు. అక్కడి నుంచి జనాలను తరిమేయడానికి లాఠీచార్జ్​ చేశారు. దీంతో పలువురు ఆందోళనకారులతో పాటు, రైతులకు గాయాలయ్యాయి. అల్లర్ల సందర్భంగా ఓ వ్యక్తి కత్తితో దాడిచేయడంతో అలీపూర్ ఎస్​హెచ్​వో ప్రదీప్ పలివాల్, మరికొందరు గాయపడ్డారు.

హర్యానా నుంచి మరింత మంది

హర్యానానుంచి కూడా ఢిల్లీ బార్డర్లకు శుక్రవారం మరింత మంది రైతులు వచ్చారు. రైతు సంఘాల నేతలకు లుకౌట్ నోటీసులు ఇవ్వడం, ప్రొటెస్టింగ్ సైట్లను ఖాళీ చేయాలం టూ ఆర్డర్ వేయడంతో హర్యానాలోని జింద్, రోహ్​తక్, కైథాల్, హిసార్, భివానీ, సోనిపట్ ప్రాంతాలనుంచి మరింత మంది రైతులు టిక్రీ, సింఘు, ఘాజీపూర్ బార్డర్లకు చేరుకున్నారు.

యూపీ గేట్ వద్ద బలగాలు వెనక్కి

ఘాజీపూర్ లో మోహరించిన అదనపు సెక్యూరిటీ బలగాలను అధికారులు వెనక్కి తీసుకున్నారు. ఆర్ఏఎఫ్, పీఏసీ బలగాలను వెనక్కి తీసుకున్నామని, కొద్దిమంది బలగాలను మాత్రమే అక్కడ ఉంచామని ఘజియాబాద్ పోలీస్ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు.