పైప్ లైన్ లీకై 20 అడుగులు ఎగసిన గ్యాస్

పైప్ లైన్ లీకై 20 అడుగులు ఎగసిన గ్యాస్

తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామాల్లో భయాందోళన

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్​జీసీ గ్యాస్​ పైపలైన్​ఒక్కసారిగా లీకైంది. 20 అడుగుల మేర గ్యాస్​ ఎగిసింది. స్థానికులు భయాందోళనతో ఊళ్లకు ఊళ్లను ఖాళీ చేశారు. గ్యాస్​లీకేజీ అదుపు చేసేవరకు గ్రామాల్లో గ్యాస్​ స్టవ్​, పొయ్యిలు వెలిగించరాదని పోలీసులు మైకుల్లో అనౌన్స్ చేశారు. కరెంటు సరఫరా పూర్తిగా నిలిపివేశారు. గ్యాస్ లీకైన ప్రాంతం దగ్గరలోని మెయిన్ రోడ్డుపై రాకపోకలు ఆపేశారు. ఆదివారం ఉదయం కాట్రేనికోన మండలం ఉప్పూడిలో ఓఎన్జీసీ రిగ్గు వద్ద మెయింటెనెన్స్  వర్క్ లో భాగంగా రిపేర్లు చేస్తుండగా  ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గ్యాస్ లీకైంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికులను అలర్ట్ చేశారు. ఓఎన్జీసీ క్రైసిస్​ మేనేజ్​మెంట్, పోలీస్, ఫైర్​ సిబ్బంది గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు చేపట్టారు.

గ్యాస్ ప్రెజర్ టెస్ట్ చేస్తుండగా ప్రమాదం

ఉప్పూడిలో పదేళ్ల కిందట ఓఎన్జీసీ ఆయిల్ నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేసింది. లో ప్రెజర్​ గ్యాస్​ ఉండటంతో డ్రిల్లింగ్ పూర్తి చేసి రిగ్గును సీజ్​ చేశారు. గ్యాస్​ ప్రెజర్​ అంచనా , పైప్​లైన్ల నిర్వహణ కోసం ఆదివారం రిగ్​ను ఓపెన్​ చేశారు. రిపేర్ చేస్తుండగా గ్యాస్​ వాల్ నుంచి గ్యాస్ లీకై 20 అడుగుల మేర ఎగిసింది. దీంతో ఉప్పూడి, పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. రిగ్​ను మూసేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. బావిలో ప్రెజర్​ టెస్ట్​ చేస్తుండగా గ్యాస్​ లీకైనట్లు ఓఎన్జీసీ అధికారులు చెప్పారు. గ్యాస్​ లీకేజీని గమనించిన సిబ్బంది బయటకు వచ్చేశారని తెలిపారు. గ్యాస్​ ప్రెజర్​ తగ్గితేనే లీకేజీ వాల్​ను మూసేయడానికి వీలవుతుందన్నారు.

గ్యాస్​ లీక్​తో ​మాకు సంబంధం లేదు: ఓఎన్జీసీ

ఉప్పూడి గ్రామంలో ఉన్న గ్యాస్​ రిగ్​ తమ నిర్వహణలో లేదని ఓఎన్జీసీ ప్రకటించింది. 2016లోనే గ్యాస్​ బావిని ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పీహెచ్​ఎఫ్​ సంస్థకు లీజుకు ఇచ్చామని స్పష్టం చేసింది. గ్యాస్​ లీకేజీని అరికట్టేందుకు సాయం చేయాలని పీహెచ్​ఎఫ్ సంస్థ కోరడంతోనే ఘటనా స్థలంలో సేవలు అందిస్తున్నట్లు చెప్పింది. గ్యాస్​ లీకేజీ ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో ప్రజలు ఎవరూ ఉండరాదని సూచించింది. స్థానిక గ్రామాల్లో లైట్లు, ఫ్యాన్లు వినియోగించరాదని పేర్కొంది. ఉప్పూడిలో ప్రజలు వంట చేసుకోవడానికి గ్యాస్​స్టవ్​లు, పొయ్యిలు వెలగించరాదని పోలీసుల ద్వారా మైకుల్లో అనౌన్స్ చేయించినట్లు తెలిపింది.