ఒకే దేశం, ఒకే ఎన్నిక.. సమగ్ర విశ్లేషణ!

ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే భావన రాజకీయ, ఆర్థిక,  పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలకంగా ఉంటుంది.  ఆ భావన నుంచి ఉత్పన్నమైన ఆలోచనే  ఒకే దేశం - ఒకే ఎన్నిక ప్రతిపాదన.  దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌‌‌‌‌‌‌‌సభ,  రాష్ట్ర శాసనసభల  ఎన్నికలు  నిర్వహించడం  ద్వారా సమర్థవంతమైన పాలనను అందించవచ్చని భావిస్తారు. అయితే, ఈ అభిప్రాయాన్ని అమలు చేయడంలో ప్రయోజనాలు, ఇబ్బందులు,  ప్రభావాలు చాలా క్లిష్టమైన అంశాలుగా నిలుస్తాయి.  జమిలి ఎన్నికల  విధాన  ప్రధాన లక్ష్యం ఎన్నికల నిర్వహణ  ఖర్చులను  గణనీయంగా తగ్గించడం.  ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో  పదేపదే  ఎన్నికలు జరగడం వల్ల  ప్రభుత్వ పాలనలో అంతరాయాలు కలుగుతున్నాయి. 

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమలు సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం, భద్రతా బలగాలు, ఎన్నికల సిబ్బందిపై మళ్లీ మళ్లీ భారం పడటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకే ఎన్నికల ద్వారా అభివృద్ధిపై దృష్టి పెట్టడం, పాలనా స్థిరత్వం కల్పించడం వీలవుతుంది. దాదాపు 97 కోట్ల ఓటర్లు, 10.50 లక్షల పోలింగ్ బూత్​లు,  వందలాది రాజకీయ పార్టీలు, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, వీటన్నిటికి ఒకేసారి ఎన్నిక నిర్వహణ సాధ్యమా అనే ప్రశ్న ఉత్పన్నమైతది.  కానీ,  ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అయినా భారతదేశానికి ఇది అసాధ్యం కాదని కచ్చితంగా చెప్పగలం. 

ఇతర దేశాలలో జమిలి ఎన్నికలు జరుగుతున్నాయా? 

1. జర్మనీ:  పార్లమెంటరీ వ్యవస్థ.(  కన్స్ట్రక్టివ్ వోట్ ఆఫ్  నో  కాన్ఫిడెన్స్ ద్వారా.. ఒక చాన్స్‌‌‌‌‌‌‌‌లర్‌‌‌‌‌‌‌‌ను పదవి నుంచి తొలగించాలంటే మరొక చాన్స్‌‌‌‌‌‌‌‌లర్‌‌‌‌‌‌‌‌ను ఎన్నిక చేయాలి).
2. యునైటెడ్ స్టేట్స్:  ప్రెసిడెన్షియల్ వ్యవస్థ ( అధ్యక్షుడు నాలుగేళ్లకు ఒకసారి తప్ప గద్దె దిగడం జరగదు (ఇంపీచ్‌‌‌‌‌‌‌‌మెంట్ మినహా).
3. స్వీడన్: పార్లమెంటరీ వ్యవస్థ. ( ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లేకపోయినా, ఇష్యూబేస్డ్ అలయన్సుల ద్వారా పనిచేస్తుంది).
4. దక్షిణ ఆఫ్రికా: పార్లమెంటరీ,  ప్రెసిడెన్షియల్ విధానాల మిశ్రమం. ( ఎన్నికలు జాతీయ, ప్రావిన్స్ స్థాయిలో ఒకేసారి జరుగుతాయి ).

జమిలి ఒక నూతన  ప్రయోగమా? 

స్వాతంత్ర్యం తర్వాత 1952  నుంచి 1967 వరకు భారతదేశంలో పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల  ఎన్నికలు ఒకేసారి నిర్వహించబడ్డాయి. అయితే, 1967లో కొన్ని రాష్ట్ర అసెంబ్లీల మధ్యకాలంలో రద్దు కారణంగా ఈ ప్రక్రియ భంగమైంది. 1970లో  లోక్‌‌‌‌‌‌‌‌సభ కాలపరిమితిని తగ్గించడంతో,  దేశంలో ఎన్నికలు తరచుగా జరుగుతున్నాయి.  ప్రస్తుతం, ప్రతి రాష్ట్రం వేర్వేరు కాలాల్లో ఎన్నికలు నిర్వహించుకోవడంతో దేశం ఎప్పుడూ  ‘ఎన్నికల మోడ్’లోనే ఉంది.  ఉదాహరణకు  తెలంగాణలో 2014 ఎన్నికలు లోక్​సభ,  అసెంబ్లీ  ఎన్నికలు  ఒకేసారి జరిగాయి.  2018లో  అప్పటి  ముఖ్యమంత్రి అసెంబ్లీని రద్దు చేయడంతో  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018,  లోక్​సభ  ఎన్నికలు 2019లో  జరిగినవి.   జమిలి ఎన్నికలు సరికొత్త ప్రయోగమేమీ కాదు.  గతం పునరావృతం మాత్రమే.  జమిలి ఎన్నికలు అమలు కావాలంటే  ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల  కాల పరిమితి మెజారిటీ ,  మైనారిటీ అని సంబంధం లేకుండా  ఫిక్స్డ్ టర్మ్ ఉండేటట్లు రాజ్యాంగ, చట్ట సవరణలతో అమలు చేసినప్పుడు జమిలి ఎన్నికలు సజావుగా జరపవచ్చు. 

జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా వినిపించే వాదనలు  

ఒకే ఎన్నికల అమలులో ప్రధాన సమస్యలలో  ఫెడరల్  వ్యవస్థకు  విఘాతం కలుగుతుందని వాదన.  జాతీయ అంశాలకే  ప్రాధాన్యం లభించడం వల్ల రాష్ట్రాల ప్రత్యేకతలు  మరుగున పడతాయి. జాతీయ,  ప్రాంతీయ పార్టీలపై ప్రభావం ఒకే ఎన్నికల పద్ధతిలో  జాతీయ పార్టీలు తమ పెద్ద  నెట్​వర్క్,  బలమైన మద్దతు కారణంగా ప్రయోజనం పొందుతాయి.  ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత తగ్గిపోవచ్చు.  ముఖ్యంగా జాతీయ రాజకీయాలపైనే దృష్టి కేంద్రీకరించడం వలన రాష్ట్రాలకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కులు పాక్షికంగా తగ్గిపోయే అవకాశం ఉందని ప్రాంతీయ పార్టీల వాదన, ఆందోళన. 

రాజ్యాంగ అడ్డంకులు

ప్రస్తుత రాజ్యాంగం ఒకే  ఎన్నికలకు మద్దతు ఇవ్వదు.  ఆర్టికల్ 83(2) లోక్‌‌‌‌‌‌‌‌సభకు  ఐదేళ్ల  పదవీకాలాన్ని  నిర్ధారిస్తుంది.  ఆర్టికల్ 172(1) రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఇదే విధమైన కాలపరిమితి అందిస్తుంది. అయితే, ఆర్టికల్ 356 ప్రకారం అసెంబ్లీ రద్దు చేయడానికి అధికారం ఉంది. ఈ ప్రతిపాదనను అమలు చేయాలంటే, లోక్‌‌‌‌‌‌‌‌సభ, రాష్ట్ర అసెంబ్లీల కాలపరిమితిని సమకాలీకరించడానికి రాజ్యాంగ సవరణలు అవసరం. ఒకే దేశం ఒకే ఎన్నికలను అమలు చేయడానికి ఆర్టికల్  83,  85,  172, 174, 356 వంటి రాజ్యాంగ  ఆర్టికల్స్​లో  మార్పులు చేయాల్సి ఉంటుంది.  ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లో  కూడా సవరణలు చేయాలి.  ఒక రాజ్యాంగ సవరణ బిల్లును  పార్లమెంటులో ప్రవేశపెట్టి,  లోక్‌‌‌‌‌‌‌‌సభ, రాజ్యసభలో  2/3 వంతుల మెజారిటీతో  ఆమోదం పొందాలి. రాష్ట్రాల శాసనసభలలో  సగం ఆమోదం కూడా అవసరం.  ఒకే దశలో  ఎన్నికలు సాధ్యం కాకపోతే,  ఎన్నికలను  రెండు దశల్లో నిర్వహించవచ్చు.  మొదటి దశలో  లోక్‌‌‌‌‌‌‌‌సభ,  కొన్ని రాష్ట్రాలు, అదేవిధంగా రెండో దశలో  మిగతా రాష్ట్రాలు.  లేదా  క్రమంగా సమకాలీకరణ  ద్వారా ఈ విధానాన్ని అమలు చేయవచ్చు.

ప్రాంతీయ పార్టీలకూ ప్రయోజనమే!

దేశంలో తరచూ జరిగే ఎన్నికలు పాలనలో అంతరాయాలు కలిగించడంతో పాటు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వం తరచూ విధానాలు మార్చడం ద్వారా పాలనను  నీరుగార్చుతున్నాయి. నేటి ఓటర్లు  కేంద్ర ప్రభుత్వానికి,  రాష్ట్ర ప్రభుత్వాలకు ఎవరు అనువైనవారో వివేకంగా నిర్ణయించగలుగుతున్నారు.  ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ ఎన్నికల ఖర్చు తగ్గడమే కాకుండా,  రాజకీయ  పార్టీలకు, అభ్యర్థులకు  వచ్చే  ఆర్థిక భారం కూడా తగ్గుతుంది.   సమగ్ర  ఎన్నికలు  ప్రాంతీయ పార్టీలకు కూడా ప్రయోజనం కలిగించవచ్చు. ఎందుకంటే వాటి వనరులతో  పోటీ చేయడం సులభం అవుతుంది. అయితే, వేర్వేరు ఎన్నికలు జాతీయ పార్టీలకు లాభదాయకంగా ఉంటాయి.  అంతేకాక,  ఒకేసారి  ఎన్నికలు  చేపడితే,  అభివృద్ధి  కార్యాచరణలను  ప్రణాళికాబద్ధంగా అమలుచేయడంలో సహాయపడుతుంది, పోటీ స్వభావంలో పుట్టే ఉచిత  ప్రయోజనాల వాగ్దానాలు (ఫ్రీబీస్) తగ్గించగలదు.  ఓటు ఉచితాలు దేశ ప్రగతికి ప్రతికూలంగా ఉంటాయి.  

సంస్కరణలు అవసరం

కేవలం ఒకే దేశం, ఒకే ఎన్నిక  ప్రతిపాదన మాత్రమే కాకుండా,  ప్రజాస్వామ్యయుతంగా  పనిచేయటానికి  అనేక  ఎన్నికల  సంస్కరణలు అవసరం. మంచి ప్రజాస్వామ్యం,  మంచి పాలన మీద ఆధారపడి ఉంటుంది.  మంచి పాలన నిష్పాక్షిక ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది.  నిష్పాక్షిక ఎన్నికలు సమాజంలోని అన్ని వర్గాల సమాన భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటాయి. చాణక్యుడు  చెప్పినట్టు దేశ స్థిరత్వం  న్యాయసమరస పాలనపై ఆధారపడి ఉంటుంది. రాజధర్మం అనేది అన్ని ధర్మాలకు మూలం.  ఇది సమత,  శ్రేయస్సుతో కూడిన సమాజానికి పునాది.  ఏకత్వంలో భిన్నత్వం,  భిన్నత్వంలో  ఏకత్వం, అదే  భారతావని  ఔన్నత్యం.  భావితరాలకు మార్గదర్శనం.

జమిలి ఎన్నికల వలన చేకూరే లాభాలు 

ఆర్థిక సమర్థత: ఎన్నికల నిర్వహణలో భారీగా ఖర్చు తగ్గుతుంది.  ఉదాహరణ: గత సాధారణ ఎన్నికలలో  రూ.60,000 కోట్లు ఖర్చు అయింది.అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరత:  ఎంసీసీ వల్ల తరచూ నిలిచిపోయే అభివృద్ధి పనులు ఈ విధానం ద్వారా నిరంతరంగా కొనసాగవచ్చు.పాలనా సమర్థత:  ఎన్నికలపైన కాకుండా పాలనపై ఎక్కువ దృష్టిపెట్టే అవకాశం ఉంటుంది.
ఒక సమగ్ర ఎన్నికల దృష్టికోణం:  జాతీయ,  ప్రాంతీయ సమస్యలను సమన్వయంతో చూడగలుగుతారు.

-   డాక్టర్  బూర నర్సయ్య గౌడ్,
మాజీ  ఎంపీ