తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన కొద్దిరోజుల్లోనే అత్యవసరంగా ఒకరోజు సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం (30 డిసెంబర్, 2024) ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కానున్నది. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల అసెంబ్లీ సమావేశం నిర్వహించి సంతాపం ప్రకటించనున్నారు. సంతాప దినాల్లో భాగంగా దివంగత మన్మోహన్ సింగ్ కు శాసన సభ నివాళులు అర్పించనుంది.
మాజీ ప్రధాని, సీనియర్ కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ (92) గురువారం(డిసెంబర్ 26) మరణించిన విషయం తెలిసిందే. శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మన్మోహన్ దేశానికి చేసిన సేవను గుర్తిసూ వారం రోజులు సంతాప దినాలు నిర్వహించనున్నట్లు సీడబ్ల్యూసీ నిర్ణయించింది. అదే విధంగా దేశ వ్యాప్తంగా 1 జనవరి 2025 నుంచి వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సంతాప దినాల్లో భాగంగా సోమవారం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయనకు నివాళులు అర్పించనుంది.
Also Read :- ఫ్యాన్స్ పై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ ..
దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన మన్మోహన్ సింగ్.. రెండు సార్లు దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయంలో 1991నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను తన వ్యూహచతురతో గాడిన పెట్టారు. ఐదుసార్లు రాజ్య సభ్యుడిగా పనిచేసిన మన్మోహన్ సింగ్.. 1987లో భారత ప్రతిష్టాత్మక అవార్డు పద్మ విభూషన్ అందుకున్నారు.
వివాద రహితుడిగా పేరుతెచ్చుకొని అందరి మన్ననలు పొందిన మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించడానికి సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుంది తెలంగాణ అసెంబ్లీ.