జనవరి ఫస్ట్ వీక్​లో ఓల్డ్ సిటీ మెట్రో పనులు షురూ

  • వచ్చే నెల చివరినాటికి ప్రభావిత ఆస్తుల కూల్చివేత
  • సెకండ్ ఫేజ్​మెట్రోకు నిధుల కొరత లేదు
  • కేంద్రం వద్ద పెండింగ్​లో 5 కారిడార్ల డీపీఆర్​లు
  • శంషాబాద్  ఎయిర్ పోర్టులో 1.5 కి.మీఅండర్​ గ్రౌండ్ మెట్రో నిర్మిస్తం
  • హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్  రెడ్డి వెల్లడి

హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లేటైనా.. మెట్రో సెకండ్​ ఫేజ్​పనులు ప్రారంభిస్తామని హైదరాబాద్  మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు. సెకండ్​ ఫేజ్​లో భాగంగా ఇప్పటికే ఓల్డ్ సిటీ మెట్రోకు సంబంధించి 1100 ఆస్తులు ఉండగా, 800 ఆస్తుల సేకరణకు సంబంధించి మార్కింగ్​​పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. డిసెంబరు చివరి నాటికి ప్రభావిత నిర్మాణాలను కూల్చి, శిథిలాలు ​తొలగిస్తామన్నారు. జనవరి మొదటి వారంలో ఓల్డ్  సిటీ మెట్రోకు సంబంధించిన ప్రాథమిక పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్  మెట్రో సెకండ్ ఫేజ్​లో ఆరు కారిడార్లుండగా, ఐదు కారిడార్లకు సంబంధించి డీపీఆర్లు​ తెలంగాణ ప్రభుత్వ ఆమోదం పొందాయని, ఈనెల 4న కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించామని చెప్పారు. కేంద్రం ఆమోదం కోసం వేచిచూస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్  మెట్రో పట్టాలెక్కి ఈనెల28 నాటికి ఏడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెట్రో ప్రస్థానం, సెకండ్​ ఫేజ్​లో చేబట్టబోయే పనులపై రసూల్ పురాలోని హైదరాబాద్  మెట్రో భవన్​లో హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఏఎంఎల్​ మేనేజింగ్ డైరెక్టర్​ఎన్వీఎస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫస్ట్​ఫేజ్, సెకండ్​ఫేజ్​కు సంబంధించి కీలక విషయాలను మీడియాతో ఆయన పంచుకున్నారు. 

ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణకు రూ.700 కోట్లు

ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ వేగంగా కొనసాగుతోందని ఎండీ ఎన్వీఎస్  రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్​–ఫలక్​నుమా వరకు మొత్తం 1100 వందల ప్రభావిత ఆస్తులను గుర్తించామని, అందులో 800 ఆస్తుల స్కెచ్ లను హైదరాబాద్  కలెక్టర్​కు పంపించామని తెలిపారు. ఓల్డ్ సిటీలో భూసేకరణకు రూ. 700 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఒక్క స్క్వేర్​యార్డుకు ప్రభుత్వ ధర రూ.23 వేలు ఉందని, ప్రభావిత ఆస్తిదారులకు రెట్టింపు చెల్లిస్తామని వెల్లడించారు. పరిహారం విషయంలో మరో 5 శాతం పెంచే విచక్షణాధికారం కలెక్టర్ కు ఉంటుందన్నారు. 106 వారసత్వ, మతపరమైన ​ కట్టడాలున్నాయని, ఒక్కటి కూడా కూల్చకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫస్ట్ ఫేజ్​ లో 370 కోర్టు కేసులు నమోదయ్యాయని, ఈసారి అలాంటివి రిపీట్​ కాకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్నొనారు.   

Also Read :- గ్రేటర్ హైదరాబాద్​లో డేంజర్ బెల్స్

మదీనా గూడలో డబుల్ డెక్కర్​... 

ఏడో కారిడార్ అయిన మియాపూర్–- పఠాన్​చెరు మార్గంలో డబుల్ డెక్కర్​మార్గం వస్తోందని ఎండీ వెల్లడించారు. 13.4 కి.మీ, 10 స్టేషన్లు ఉన్న ఈ కారిడార్లో... మదీనాగూడ వద్ద 1.6 కిమీ బడుల్​డెక్కర్​మార్గం రానున్నట్లు తెలిపారు. కింద నేషనల్​హైవే, పైన మెట్రో మార్గం ఉండేలా ప్లాన్​ చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి నేషనల్​ హైవే అధికారులతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. శంషాబాద్  ఎయిర్ పోర్టులో 1.5 కి.మీ అండర్​ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నామని  వెల్లడించారు.

సెకండ్​ ఫేజ్​ మొదలు పెట్టకపోతే 9వ స్థానానికి

మెట్రో పట్టాలెక్కిప్పటినుంచి ఇప్పటి వరకు 3 కారిడార్ల పరిధిలో 63.40 కోట్ల మంది ప్రయాణించారని, ఢిల్లీ తర్వాత 2వ స్థానంలో నిలిచిందని ఎండీ తెలిపారు. పదేండ్లుగా పనులు నిలిచిపోవడం వల్ల ఆపరేషనల్  నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో మూడో స్థానానికి పడిపోయిందని, వెంటనే సెకండ్​ఫేజ్​  పనులు చేపట్టకపోతే 9వ స్థానానికి పడిపోయే ప్రమాదముందన్నారు. సెంకడ్​ఫేజ్​లో 6 కారిడార్లుండగా, ఆరో కారిడార్ (ఎయిర్​పోర్టు నుంచి ఫోర్త్ సిటీ  40 కి.మీ) ప్రతిపాదనలు విడిగా రూపొందిస్తున్నామని చెప్పారు. మిగిలిన ఐదు కారిడార్లకు 76.4  కి.మీ డీపీఆర్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదంతో, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని తెలిపారు. సెకండ్ ఫేజ్​ 5 కారిడార్లు మొత్తం 76.4 కి.మీ,54 స్టేషన్లు, రూ.24,269 కోట్లతో నిర్మించస్తామని వివరించారు. సెకండ్ ఫేజ్​పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్  ఫోకస్​ పెట్టారని, ఏడాదిలో పదిసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారని ఎండీ తెలిపారు. సెకండ్​ ఫేజ్​ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జాయింట్  వెంచర్​గా చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించామని చెప్పారు. ఇందులో తెలంగాణ వాటా రూ.7,313 కోట్లు (30 శాతం), కేంద్ర ప్రభుత్వ వాటా రూ.4,230 కోట్లు (18 శాతం), మరో 48 శాతం రూ.11,693 కోట్లను ప్రాజెక్టు రుణాలుగా కేంద్ర ప్రభుత్వ పూచీకత్తుగా ఇచ్చే సావరిన్  గ్యారంటీతో జేఐసీఏ, ఏడీబీ, ఎన్​డీబీ వంటి మల్టీ లేటరల్  సంస్థల నుంచి సేకరిస్తామని వివరించారు. మరో 4 శాతం రూ.1033 కోట్ల పెట్టుబడిని సెంట్రల్  గవర్నమెంట్  నిబంధనల ప్రకారం పీపీపీ విధానంలో సమకూర్చుకుంటామన్నారు.