ఓలాకు సాఫ్ట్‌‌బ్యాంక్‌‌ నుంచి రూ.1,725 కోట్లు

ఓలాకు సాఫ్ట్‌‌బ్యాంక్‌‌ నుంచి రూ.1,725 కోట్లు

న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్‌‌ వాహనాల విభాగం ఓలా ఎలక్ట్రిక్‌‌ మొబిలిటీలో జపాన్‌‌కు చెందిన సాఫ్ట్‌‌బ్యాంక్‌‌ రూ.1,725 కోట్లు (దాదాపు 250 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్‌‌ చేసింది. ఈ విషయాన్ని ఓలా రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో వెల్లడించింది. తాజాగా అందిన ఈ నిధుల వల్ల ఓలా ఎలక్ట్రిక్‌‌ మొబిలిటీ (ఓఈఎం) స్టార్టప్‌‌ నుంచి యూనికార్న్‌‌ స్థాయికి ఎదిగింది. మనదేశంలో ఫ్లిప్‌‌కార్ట్‌‌, జొమాటో, పేటీఎం, ఓఈఎం పేరెంట్‌‌ కంపెనీ ఓలాకు యూనికార్న్‌‌ హోదా ఉంది. ఈ నిధుల జారీ కోసం సాఫ్ట్‌‌బ్యాంక్‌‌ 4,326 కంపల్సరిలీ కన్వర్టబుల్‌‌ సిరీస్‌‌ బీ ప్రిఫరెన్స్‌‌ షేర్లను కేటాయించింది. ఒక్కోదాని ముఖ విలువ రూ.10. నిధుల కేటాయింపు ప్రతిపాదనకు గత నెల 25న బోర్డు మెంబర్లు ఆమోదముద్ర వేశారు. దీంతో మంగళవారం నిధుల కేటాయింపు పూర్తయింది. ఓలాలో సాఫ్ట్‌‌బ్యాంక్‌‌ ఏకైక అతిపెద్ద ఇన్వెస్టర్‌‌. టాటా సన్స్‌‌ చైర్మన్‌‌ ఎమిరిటస్ రతన్‌‌ టాటా మే నెలలో సిరీస్‌‌ ఏ ఫండింగ్‌‌ రౌండ్‌‌లో భాగంగా ఇన్వెస్ట్‌‌ చేశారు. ఈ మొత్తం విలువ మాత్రం తెలియలేదు. సిరీస్‌‌ ఏ ఫండింగ్‌‌ రౌండ్‌‌లో ఓఈఎంకు టైగర్‌‌ గ్లోబల్‌‌, మ్యాట్రిక్స్‌‌ ఇండియా నుంచి ఈ ఏడాది మార్చిలో రూ.400 కోట్లు వచ్చాయి. ఓలా ఎలక్ట్రిక్‌‌ ప్రయోగాత్మకంగా బ్యాటరీ చార్జింగ్‌‌ సేవలు అందిస్తోంది. బ్యాటరీ స్వాపింగ్‌‌ స్టేషన్లు నిర్వహిస్తోంది. టూ, త్రీ, ఫోర్ వీలర్‌‌ ఎలక్ట్రిక్‌‌ బండ్లను నడుపుతోంది. 2021 నాటికి దేశవ్యాప్తంగా పది లక్షల ఎలక్ట్రిక్‌‌ వాహనాలతో సేవలు అందిస్తామని ఇది గత ఏడాది ప్రకటించింది.