- 60 నుంచి 80 ఫీట్లు వెడల్పు చేస్తున్న మున్సిపాలిటీ
- స్వచ్ఛందంగా బిల్డింగులు తొలగిస్తున్న యజమానులు
- వ్యాపారులపై కక్షసాధింపు చర్యలని ప్రతిపక్షాల విమర్శ
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మార్కెట్ ఏరియాలో కొంతకాలంగా ట్రాఫిక్సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెట్‌బ్యాక్ లేకుండా బిల్డింగులు నిర్మించడం, పార్కింగ్‌కు వదిలేయాల్సిన సెల్లార్లలో షాపులు ఏర్పాటు చేయడం, ఫుట్ పాత్లను చిరువ్యాపారులకు రెంట్‌కు ఇవ్వడం వల్ల రోడ్లు ఇరుకుగా మారాయి. కార్లు, బైక్‌లు రోడ్ల మధ్యలో పార్కింగ్ చేస్తుండడంతో జనం నడవడానికి కూడా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఆదేశాలతో మున్సిపల్అధికారులు ట్రాఫిక్సమస్యలకు చెక్ పెట్టేందుకు రోడ్ల వెడల్పునకు శ్రీకారం చుట్టారు.
మున్సిపల్మస్టర్ ప్రకారం మార్కెట్ఏరియాలోని రోడ్లను 60 నుంచి 80 ఫీట్లుగా వెడల్పు చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం సర్వే చేసి బిల్డింగులకు మార్కింగ్ చేసి దసరా ముందు వైడెనింగ్ పనులు స్టార్ట్ చేశారు. అయితే అప్పుడు పండుగ సీజన్ కావడంతో బిజినెస్‌కు అంతరాయం కలుగుతుందని, కొంత టైమ్ఇస్తే తామే స్వచ్ఛందంగా బిల్డింగులను తొలగిస్తామని యజమానులు కోరడంతో గడువు ఇచ్చారు. ఇటీవల మళ్లీ వైడెనింగ్పనులను అధికారులు స్పీడప్ చేశారు.
నాలుగు నుంచి తొమ్మిది ఫీట్లు తొలగింపు
మార్కెట్ రోడ్లో అర్చన టెక్స్ చౌరస్తా నుంచి పోలీస్స్టేషన్వరకు, గంగారెడ్డి రోడ్లో ముకరం చౌరస్తా నుంచి వెంకటేశ్వర టాకీస్, అర్చన టెక్స్ నుంచి వాటర్ ట్యాంక్ మీదుగా మున్సిపల్ ఆఫీస్, జగదాంబ కాంప్లెక్స్‌నుంచి మెయిన్ రోడ్డు వరకు 60 ఫీట్లుగా, స్టేషన్ రోడ్లో ముకరం చౌరస్తా నుంచి ఇటు రైల్వేస్టేషన్, అటు ఓవర్ బ్రిడ్జి వరకు 80 ఫీట్లుగా, రైల్వేస్టేషన్ నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు 100 ఫీట్లు వెడల్పు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతమున్న బిల్డింగులను నాలుగు నుంచి పది ఫీట్ల వరకు తొలగించాల్సి వస్తోంది. రోడ్లపైకి వచ్చిన బిల్డింగులను, రోడ్లను ఆక్రమించి నిర్మించిన ర్యాంపులను తొలగిస్తున్నారు. ఫలితంగా త్వరలోనే మార్కెట్ ఏరియాలోని రోడ్లు విశాలంగా మారనున్నాయి.
ALSO READ :ఇందిరమ్మ స్కీమ్‌కు పట్టా చిక్కులు .. సింగరేణి, ఏజెన్సీ ప్రాంత పేదల్లో ఆందోళన
ప్రతిపక్షాల ఆరోపణలు
రోడ్ల వెడల్పుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మార్కెట్ ఏరియాలోని వ్యాపారులు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి ఓటేయలేదన్న అక్కసుతోనే రోడ్ల వెడల్పు పేరిట ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు, బీఆర్ఎస్మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపిస్తున్నారు. ప్రజలు మాత్రం రోడ్ల వెడల్పు నిర్ణయాన్ని స్వాగతిస్తుండడం విశేషం.