మల్లన్నసాగర్​ నిర్వాసితుల ఓట్లు ఎక్కడ ?

  • గతంలో తొగుట, కొండపాక మండలాల్లో ముంపు గ్రామాలు
  • నాలుగేండ్ల కింద గజ్వేల్‌‌ పరిధిలోని ఆర్‌‌అండ్‌‌ఆర్‌‌ కాలనీకి  ఏడు గ్రామాలు
  • మున్సిపాలిటీ పరిధిలో ఉండడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం
  • ఓటర్‌‌ లిస్ట్‌‌ను పెండింగ్‌‌లో పెట్టిన అధికారులు
  • ప్రత్యేక గ్రామాలుగానే కొనసాగించాలని నిర్వాసితుల డిమాండ్‌‌

సిద్దిపేట, వెలుగు : మల్లన్న సాగర్‌‌ రిజర్వాయర్‌‌ నిర్మాణంతో ముంపునకు గురైన తొగుట, కొండపాక మండలాల్లోని ఏడు గ్రామ పంచాయతీల ఓటర్‌‌ లిస్ట్‌‌ విడుదలపై సందిగ్ధత నెలకొంది. ముంపు సమయంలో వాటిని గజ్వేల్‌‌ మున్సిపాలిటీ పరిధిలోకి తరలించడంతో ఆ గ్రామాలు మున్సిపాలిటీలోకి వస్తాయా ? లేక మండల పరిధిలో కలుపుతారా ? అనే విషయంపై గందరగోళం ఏర్పడింది. ఈ విషయం తేలకుండా ఓటర్‌‌ లిస్ట్‌‌ విడుదల చేస్తే టెక్నికల్‌‌ సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో ఆయా గ్రామాల ఓటర్‌‌ లిస్ట్‌‌ విడుదలను ఆఫీసర్లు పెండింగ్‌‌లో పెట్టారు.

నాలుగేండ్ల కింద తరలింపు

తొగుట మండలంలోని వేములఘాట్‌‌, బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్, పల్లెపహాడ్,  ఏటిగడ్డ కిష్టాపూర్, కొండపాక మండలంలోని సింగారం, ఎర్రవల్లి గ్రామాలు మల్లన్నసాగర్‌‌ ముంపునకు గురయ్యాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలను నాలుగేండ్ల కింద గజ్వేల్‌‌ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్, ముట్రాజ్‌‌పల్లిలో నిర్మించిన ఆర్‌‌అండ్‌‌ఆర్‌‌ కాలనీకి తరలించారు. అక్కడే ప్రైవేట్‌‌ భవనాల్లో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి పాలనా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కానీ ప్రస్తుతం గ్రామ పంచాయతీల పాలన పూర్తి కావడంతో ఎన్నికల నిర్వహణకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. 

ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల వారీగా ఓటర్‌‌ లిస్ట్‌‌ను నాలుగు రోజుల కింద విడుదల చేశారు. కానీ ఈ ఏడు గ్రామాలు ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన ఆర్‌‌అండ్‌‌ఆర్‌‌ కాలనీలో కొనసాగుతుండడంతో ఎన్నికల నిర్వహణపై ఆఫీసర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ పంచాయతీల కోసం ఓటరు లిస్ట్‌‌ను విడుదల చేస్తే కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉండంతో ఆ ఏడు గ్రామాల ఓటర్‌‌ లిస్ట్‌‌ను వెల్లడించకుండా పెండింగ్‌‌లో పెట్టారు.

ఏడు గ్రామాల్లో 12 వేల ఓటర్లు

ఏడు ముంపు గ్రామాల్లో 12వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఈ ఆర్‌‌అండ్‌‌ఆర్‌‌ కాలనీలు మున్సిపాలిటీ పరిధిలో ఉండడంతో  ఆఫీసర్లు ఓటర్‌‌ లిస్ట్‌‌ విడుదల చేయకుండా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ముంపు గ్రామాలను గజ్వేల్‌‌ మండల పరిధిలో కలుపుతారా ? లేక మున్సిపాలిటీలో విలీనం చేస్తారా ? అన్న విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే నిర్ణీత గడువులోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే ఆ ఏడు గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ జరగనుంది. 

పంచాయతీలుగానే కొనసాగించాలని డిమాండ్

మల్లన్నసాగర్ ముంపు గ్రామాలను  పంచాయతీలుగానే కొనసాగించి ఎన్నికలను నిర్వహించాలని నిర్వాసితులు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ కాలనీ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి పంచాయతీలుగా కొనసాగేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఇటీవల ఎమ్మెల్సీ యాదవరెడ్డిని సైతం కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో విలీనం చేస్తే ప్రజలపై పన్నుల భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం 

మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ఓటరు లిస్ట్‌‌‌‌‌‌‌‌ వెల్లడిపై ఏర్పడిన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ కాలనీ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉండడంతో సమస్య ఏర్పడకుండా ఉండేందుకే ఓటర్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌ విడుదల చేయలేదు. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం.

దేవకీ దేవి, డీపీవో