- పులులు, సింహాలు, కోతులు, ఎలుగుబంట్లు, పిల్లులకు హీటర్లు
- పాములు, సరీసృపాల కోసం ఎండుటాకులు, బల్బులు, కుండలు
- ఏనుగులు, జిరాఫీలకు వేపాకు పొగ
- గబ్బిలాలు, ముళ్లపందులు, గుడ్లగూబలకు ఏసీ బంద్
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జూ అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: చలికాలం జంతువులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు జూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చలితో జంతువులు న్యూమోనియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉండడంతో హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
జూపార్కులో ఉండే జంతువులు, సరీసృపాలు, పక్షులను చలి నుంచి రక్షించడానికి హీటర్లు, హీట్లైట్లు, ఎన్క్లోజర్ల చూట్టూ గోనె సంచులు, గ్రీన్షెడ్నెట్స్ ఏర్పాటు చేశారు. చలికి తట్టుకునేలా ఉండే ఆహారాన్ని మాత్రమే ఇస్తున్నారు.
హీటర్లతో చలి మాయం
జూపార్క్ లో ఉన్న పులులు, సింహాలు, చీతాలు, కోతులు, చింపాజీలు, ఎలుగుబంట్లు, పిల్లులు, చలిబారిన పడకుండా జూపార్క్ అధికారులు హీటర్లను ఏర్పాటు చేశారు. రాత్రి నుంచి ఉదయం వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుండడంతో రాత్రి అవి విశ్రాంతి తీసుకునే రూముల వద్ద హీటర్లను ఏర్పాటు చేశారు. పాములు, రెప్టైల్స్(సరీసృపాలు) ఉండే హౌస్ లలో చలికి తట్టుకోవడానికి ఎండుటాకులు, వెచ్చదనానికి బల్బులు, చిన్న చిన్న కుండలు ఏర్పాటు చేశారు. ఏనుగులు, జిరాఫీలను చలి గాలుల, దోమల నుంచి రక్షించడానికి రాత్రి వేళల్లో డెన్ల వద్ద వేపాకు పొగ వదులుతున్నారు.
చుట్టూ.. గన్నీ బ్యాగులతో
చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో జంతువులు ఇబ్బందులు పడకుండా ఎన్క్లోజర్ల చుట్టూ గన్నీ బ్యాగులు, గ్రీన్షేడ్ నెట్లతో కప్పి ఉంచారు. ఎన్ క్లోజర్ల కిటికీలు, తలుపుల వద్ద గన్నీ బ్యాగులతో... కప్పి ఉంచారు. చిలుకలు, పిచ్చుకలు తదితర ఫక్షులను వెచ్చగా ఉంచేందుకు చెక్క గూళ్లు ఏర్పాటు చేసి అందులో ఎండుగడ్డిని పేర్చారు. పక్షుల గూళ్ల వద్ద అవి పొదగడానికి కుండలు పెట్టారు.
చిన్న జింకలు ఇబ్బందులు పడకుండా వాటి బ్రీడింగ్ సెంటర్లలో ఎండిన గడ్డితో చెక్క బాక్సులు పెట్టారు. గబ్బిలాలు, ముల్లపందులు, గుడ్లగూబల్లాంటి నిశాచర జీవులుంటే యానిమల్హౌస్లో మార్చి వరకు ఏసీలు వాడకుండా చర్యలు తీసుకున్నారు.