అక్కడ బిచ్చగాళ్ల సమాచారమిస్తే.. వెయ్యి రూపాయల రివార్డు

  • బిచ్చగాళ్ల సమాచారమిస్తే రూ.1000 రివార్డు
  • ఆరుగురికి అందజేసిన ఇండోర్ కలెక్టర్

ఇండోర్: దేశంలో అత్యంత పరిశుభ్రమైన సిటీగా పేరొందిన ఇండోర్ ను బిచ్చగాళ్ల రహితంగా చేయాలని అధికారులు నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగా సిటీలో భిక్షాటనపై కలెక్టర్ నిషేధం విధించారు. బిచ్చగాళ్లు ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారికి రూ.1,000 బహుమతిగా అందిస్తామని ఓ మొబైల్‌‌ నంబర్‌‌ ను కూడా ఇచ్చారు. 

దీనికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు. గత నాలుగు రోజుల్లో ఈ నంబర్ కు 200 మంది కాల్ చేయగా..12 మంది అందించిన సమాచారం విచారణ తర్వాత సరైనదేనని తేలిందని చెప్పారు. వీరిలో ఆరుగురికి సోమవారం కలెక్టరేట్​లో రూ.1000ని బహుమతిగా అందించామని పేర్కొన్నారు. ఇండోర్ లో యాచకులు లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 

సిటీలో భిక్షాటన చేయడం, యాచకులకు వస్తువులను కొనివ్వడం వంటివి నిషేధిస్తూ జనవరి 2న సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సిటీలో ఎవరైనా యాచిస్తే పోలీసు కేసు నమోదు చేస్తామని పేర్కొంది. ఈ క్రమంలోనే తాజా రివార్డు ప్రకటన జారీ చేసింది.