అక్రమ వసూళ్లకు చెక్ .. ఇక హెడ్డాఫీస్​ నుంచే వాటర్​ సర్టిఫికెట్ జారీ

  • ఇందుకోసం స్పెషల్​ కమిటీని ఏర్పాటు చేసిన వాటర్​ బోర్డు 
  • ఇప్పటివరకు స్థానిక జీఎం ఆఫీసుల నుంచి జారీ
  • అవినీతికి ఆస్కారం లేకుండా తాజా నిర్ణయం

హైదరాబాద్​సిటీ, వెలుగు: మహానగరంలో ఇండ్లు, బిల్డింగులు నిర్మించుకోవాలనుకునేవారు బల్దియా పర్మిషన్​ కావాలంటే వాటర్​బోర్డు నుంచి ఫీజిబిలిటీ సర్టిఫికెట్​తోపాటు విద్యుత్ ఫీజిబిలిటీ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. వాటర్ బోర్డుకు సంబంధించిన ఫీజిబిలిటీ సర్టిఫికెట్లను గతంలో సర్కిల్ ఆఫీసుల్లోని సంబంధిత డివిజన్ ​జీఎంలు జారీ చేసేవారు. వాటర్​బోర్డు సర్కిల్​ఆఫీసుల్లో అప్లయ్​చేసుకుంటే అప్రూవ్​ చేసి హెడ్డాఫీసుకు పంపేవారు. వాటిని పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారులు సర్టిఫికెట్ జారీ చేసేవారు. 

అయితే, సర్టిఫికెట్ల జారీకి కొందరు కిందిస్థాయి సిబ్బంది డబ్బు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డబ్బు ఇవ్వనివారి దరఖాస్తులను ఏదో సాకు చెప్పి పెండింగ్​లో పెడుతున్నారని తెలుస్తోంది. ఈ పరిస్థితిని నివారించి, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ఈజీ చేయడానికి ఇక నుంచి హెడ్డాఫీస్​ నుంచి జారీ చేసేలా అధికారులు నిబంధనల్లో మార్పులు చేశారు. 

స్పెషల్​ కమిటీ ఏర్పాటు

నిర్మాణదారులకు ఇచ్చే వాటర్ ఫీజిబిలిటి సర్టిఫికెట్ల కోసం వాటర్​బోర్డు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో బోర్డు రెవెన్యూ డైరెక్టర్, సీజీఎం, జీఎం మెంబర్లుగా ఉంటారు. కొత్త రూల్స్​ ప్రకారం ఈ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులు ముందుగా దగ్గర్లోని సీజీఎంలకే దరఖాస్తులు సమర్పించాలి. వారు పరిశీలించి వారం రోజుల్లో హెడ్డాఫీసులోని కమిటీకి పంపుతారు. అప్లయ్​ చేసుకున్న 30 రోజుల్లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కమిటీ దరఖాస్తులను మళ్లీ పరిశీలించి స్థల విస్తీర్ణం, భూమికి సంబంధించి నిజమైన ఓనర్​ఎవరు, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్టుగా ఉన్నాయా లేదా అన్నది చూస్తుంది. 

Also Read : రిమ్స్​లో అరుదైన సర్జరీలు

విస్తీర్ణాన్ని బట్టి ఏ సైజ్ కనెక్షన్ ఇవ్వాలన్నది కూడా మెన్షన్ చేస్తారు. నిర్దేశిత 5 పని దినాల్లో రెవెన్యూ విభాగపు చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) సర్టిఫికెట్లను జారీ చేస్తారు. గ్రేటర్​ పరిధిలోని ఆయా డివిజన్లు, సర్కిళ్ల పరిధిలో నెలకు 150 నుంచి 200 వరకు దరఖాస్తులు వస్తున్నాయని, అవినీతి అంతం, ఆలస్యం జరగకుండా ఉండేందుకే కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్టు తెలిపారు.