అధికారులు నన్ను  అవమానిస్తున్నరు : బక్కి వెంకటయ్య

  • ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆవేదన 
  • మెదక్ జిల్లాలో ప్రొటోకాల్ పాటించడం లేదని వెల్లడి

మెదక్, వెలుగు: ‘‘అధికారులు నన్నేం లెక్కజేస్తలేరు.. పలుమార్లు నాకు అవమానం జరిగింది.. ఇక సాధారణ ఎస్సీ, ఎస్టీ పౌరులు ఓ లెక్కనా?’’ అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా అధికార యంత్రాంగం ప్రొటోకాల్ పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం మెదక్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లో ఎస్సీ, ఎస్టీల భూముల సమస్యలు, అట్రాసిటీ కేసులపై సంబంధిత డిపార్ట్‌‌మెంట్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, జిల్లా విజిలెన్స్, అండ్ మానిటరీ కమిటీ సభ్యులు, ఆయా ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. తాను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ అయ్యాక జీఏడీకి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోటోకాల్ ఇవ్వడం జరిగిందన్నారు. కాగా ఇటీవల మెదక్ కలెక్టరేట్‌‌లో మంత్రులు దామోదర్ రాజనర్సింహా, కొండా సురేఖ అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల గురించి తనకు కనీస సమాచారం లేదన్నారు. ఇటీవల జరిగిన సమావేశం సందర్భంగా స్టేజీ మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫొటోలు పెట్టి, తన ఫొటో పెట్టలేదన్నారు. స్టేజి మీద నేమ్​ప్లేట్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు.

సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో జరిగే ప్రతి అధికారిక కార్యక్రమానికి ఆయా జిల్లాల అధికారులు తనను ఆహ్వానిస్తున్నా మెదక్ జిల్లా కలెక్టర్, అధికారులు మాత్రం ప్రొటోకాల్ పాటించడం లేదని, అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని అన్నారు. తనను గౌరవించకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముందు ఇలా జరగకుండా చూసుకోవాలని కలెక్టర్​కు సూచించారు. మరోసారి ఇలా జరిగితే ఉపేక్షించేది లేదన్నారు.

సమస్యలు త్వరగా పరిష్కరించాలి

మెదక్ జిల్లాలోనే ఎస్సీలపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు. రామాయంపేట మండలం వెంకటాపూర్, శివ్వంపేట మండలం కొంతాన్​పల్లి, మనోహరాబాద్ మండలం గౌతోజీ గూడలో జరిగిన ఘటనల్లో బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.