ఖాళీ ప్లాట్లలో చెత్త తీయకపోతే .. ఓనర్లకు రూ.10 వేల ఫైన్

  • నోటీసులకు స్పందించకపోవడంతో ఓనర్లకు రూ.10 వేల ఫైన్
  • రెండేళ్లలో 40 వేల మందికి నోటీసులు 
  • సొంతంగా ప్లాట్లను క్లీన్ చేసుకున్న 10 వేల మంది 
  • క్లీన్ చేయకపోతే ప్రభుత్వ స్థలాలుగా బోర్డు.. కలెక్టర్​ 

ఖమ్మం, వెలుగు:  ఖాళీ ప్లాట్లలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించని ప్లాట్ల ఓనర్లకు ఖమ్మం కార్పొరేషన్​ అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. ఎవరి ప్లాట్లను వాళ్లే క్లీన్​ చేయించుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కొంతమంది నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో యాక్షన్​ షురూ చేశారు. మున్సిపల్ సిబ్బందితో ఆయా ప్లాట్లను క్లీన్​ చేయించి మట్టిపోయిస్తున్నారు. ఆ తర్వాత ప్లాట్ క్లీనింగ్ కు అయిన ఖర్చుతో పాటు రూ.10వేల వరకు ఫైన్ వసూలు చేస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్​ పరిధిలో 60 డివిజన్లున్నాయి. వీటిలో నగరంలో మెయిన్​ రోడ్లను ఆనుకొని, ఇండ్ల మధ్యలోనే వేలాది ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ప్లాట్లు కొనుక్కున్న యజమానులు వాటిలో నిర్మాణాలు చేపట్టకుండా పట్టించుకోకపోవడంతో మినీ డంప్​ యార్డుల్లా మారుతున్నాయి. 

చెత్తాచెదారంతో దోమలకు, పాములకు ఆవాసాలుగా మారుతున్నాయి. పక్కనున్న ఇండ్ల కంటే లోతట్టుగా ఉంటే వర్షాకాలంలో వాననీళ్లు చేరి కంపు వాసన కొడుతున్నాయి.  స్థానికుల నుంచి ఆఫీసర్లకు వరుసగా ఫిర్యాదులు వస్తుండడంతో నోటీసుల ఇచ్చారు. గత రెండేళ్లలో దాదాపు 40వేల మంది ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఇందులో దాదాపు10 వేల మంది మాత్రమే నోటీసులకు స్పందించి ప్లాట్లను క్లీన్​ చేసుకున్నారు. చెట్లను, చెత్తాచెదారాన్ని తొలగించుకున్నారు. మిగిలిన వారికి ఫైన్లు వేసి ఇప్పటివరకు రూ.80 వేలు అధికారులు రికవరీ చేశారు. 

ప్రతి గురువారం ఒక్కో డివిజన్‌లో రెండు చొప్పున మొత్తం 60 డివిజన్లలో 120 ప్లాట్లను క్లీన్​ చేస్తున్నారు.  ఖాళీ ప్లాట్ల వల్ల సమస్యల గురించి ఇటీవల ఖమ్మం కలెక్టర్​ ముజమ్మిల్ ఖాన్ కు కొంతమంది ఫిర్యాదులు చేశారు. రెండు వారాల క్రితం నగరంలో కలెక్టర్​పర్యటిస్తున్న సమయంలో కొందరు ఈ సమస్యపై కంప్లైంట్ చేశారు.  దీంతో ప్లాట్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను కలెక్టర్​ ఆదేశించారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోతే ఆయా ఖాళీ స్థలాలను ప్రభుత్వ స్థలాలుగా బోర్డులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.  ఖాళీ ప్లాట్లలో పేరుకుపోతున్న చెత్త వల్ల సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీంతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. 

చెత్తతో సమస్యలు వస్తున్నాయి 

మా ఇండ్లకు మధ్యలోనే ఉన్న ఖాళీ ప్లాట్లలో చెత్త, పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. వీటి కారణంగా పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు.  దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. అప్పుడప్పుడు పాములు కూడా తిరుగుతున్నాయి. ప్లాట్ల ఓనర్లకు పెనాల్టీ వేయడాన్ని సమర్థిస్తున్నాం. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
- అనిల్, బ్యాంక్​ కాలనీ, ఖమ్మం

ALSO READ : మూసీలో ఆక్రమణలు తొలగించాల్సిందే

ఖమ్మం కార్పొరేషన్​ 16 వ డివిజన్​ లోని శ్రీరామ్​నగర్​రోడ్​నెంబర్​14లో ఖాళీ స్థలంలో పిచ్చిమొక్కలున్నాయి.  దాన్ని శుభ్రం చేసుకోవాలని ఈనెల 8న అధికారులు నోటీసులు ఇచ్చారు.  తర్వాత కూడా స్పందించకపోవడంతో స్థల యజమాని కేతినేని వంశీధర్, తాళ్లూరి సురేశ్ బాబు నుంచి తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 సెక్షన్​ 161 కింద రూ.10 వేల జరిమానా వసూలు చేశారు.