మల్లేపల్లిలో సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసిన ఆఫీసర్లు

కొండాపూర్, వెలుగు: సంక్షేమ హాస్టళ్లలో స్టూడెంట్స్​ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వం విద్యా కమిషన్ ద్వారా ఆరా తీస్తుంది. గురువారం రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మండలంలోని కస్తూర్బా, మల్లేపల్లిలోని ఎస్సీ బాలికల హాస్టళ్లను తనిఖీ చేశారు. స్టూడెంట్స్​ను కాస్మోటిక్ చార్జీలు అందుతున్నాయా, భోజనం రుచిగా ఉంటుందా లేదా అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించి అనంతరం ప్రిన్సిపాల్​తో సమావేశం నిర్వహించారు. ఆయన వెంట డీఈవో వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల డీడీ అఖిలేష్ రెడ్డి ఉన్నారు.

శివ్వంపేట: మండల స్పెషల్ ఆఫీసర్ ప్రతాప్ సింగ్, ఎంఈ ఓ బుచ్చ నాయక్,  ఎంపీడీవో నాగేశ్వరరావు గురువారం దొంతి  ఎస్సీ బాయ్స్​హాస్టల్,  గోమారం బీసీ బాయ్స్​హాస్టల్, శివ్వంపేట ఎస్సీ బాయ్స్​హాస్టల్, గూడూరు కస్తూర్బా బాలికల గురుకులాన్ని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనేది స్టూడెంట్స్​ను అడిగి తెలుసుకున్నారు. బియ్యం, కూరగాయలను పరిశీలించారు. 

స్టూడెంట్స్​వసతులు పై హాస్టల్ వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు. గోమారం బాలుర హాస్టల్​లో,  గూడూరు కస్తూర్బా బాలికల గురుకులంలో బాత్రూంలు తక్కువగా ఉండడంతో స్టూడెంట్స్​ఇబ్బందులు పడుతున్నారని వార్డెన్లు చెప్పారు. శివ్వంపేట ఎస్టీ హాస్టల్ కు  కాంపౌండ్ లేక పందులు హాస్టల్ దగ్గర సంచరిస్తుండడంతో దోమలు, ఈగలు బాగా పెరిగాయన్నారు. వీటిపై పై అధికారులకు రిపోర్టు పంపించి సమస్యలను పరిష్కరిస్తామ న్నారు. ఈ సందర్భంగా వార్డెన్లు రాజకుమార్. యాదగిరి ఉన్నారు. 

రేగోడ్ కేజీబీవీలో ముక్కిపోయిన కూరగాయలు

రేగోడ్: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో స్టూడెంట్స్​కు అందించే భోజనంలో నాణ్యతలేని  కూరగాయలు వాడుతున్నట్టు అధికారుల తనిఖీలో వెల్లడైంది. వివరాల్లోకి వెళితే..  రేగోడ్ ఎంఈవో గురునాథ్ గురువారం స్థానిక వైద్య సిబ్బంది, కాంప్లెక్స్ హెచ్ఎంతో కలిసి కేజీబీవీనీ విజిట్ చేశారు. స్కూల్​లో స్టోర్ రూమ్ ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా నాణ్యతలేని, కుళ్లిపోయిన కూరగాయలను గుర్తించినట్లు  ఎంఈవో తెలిపారు.

  కాంట్రాక్ట్ పద్ధతిలో వారానికి ఒకసారి మెదక్ నుంచి కూరగాయలు వస్తాయని వాటిని స్టోర్ చేయడం ఇబ్బందిగా ఉందని ఎస్ వో స్వయంప్రభ తెలిపారన్నారు.  వారానికి రెండుసార్లు కూరగాయలు వచ్చే విధంగా చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. తక్షణమే నాణ్యతలేని కూరగాయలను స్టోర్ రూమ్ నుంచి తీసేయాలని వాటి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేజీబీవీ సిబ్బందికి తెలిపామన్నారు.