సర్వే నంబర్ 118/పీలో ఆక్రమణలు నిజమే

బాలానగర్, వెలుగు: మహబూబ్​నగర్  జిల్లా బాలానగర్  మండల కేంద్రంలోని సర్వే నంబర్ 118/పీలో సర్కారు భూమి ఆక్రమణకు గురైనట్లు ఆఫీసర్లు విచారణలో తేలింది. దీనిపై శనివారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బాలానగర్​లో చెరువు కాలువ, శ్మశానవాటికను ధ్వంసం చేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించారని కొద్ది రోజుల కింద తాను కలెక్టర్​కు కంప్లైంట్  చేశానన్నారు. స్పందిచిన కలెక్టర్  ఫోర్​మెన్  కమిటీ వేశారని, కమిటీ మే నెలలో రైతులు, గ్రామస్తులను కలిసి విచారణ చేసి, వారి స్టేట్​మెంట్​ రికార్డ్  చేసిందన్నారు. ఇటీవల విచారణ నివేదికను కలెక్టర్  అందించారన్నారు. కమిటీ ఇచ్చిన రిపోర్టులో శ్రీ వారాహి ఇన్ఫ్రా అండ్  డెవలపర్స్  సంస్థ ఈ సర్వే నంబర్​లోని భూమిలో 1,67,396 మెట్రిక్  టన్నుల మట్టిని 

బయటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పోశారని తేల్చిందన్నారు. బాలానగర్  పెద్ద చెరువుకు వెళ్లే కాలువను మట్టితో పూడ్చేసి, దాని దిశను మార్చేసినట్లు స్పష్టం చేశారన్నారు. 2.20 ఎకరాల్లో ఉన్న శ్మశాన వాటికను కూడా ధ్వంసం చేసినట్లు విచారణలో తేలిందన్నారు. 

అధికారులపై చర్యలు తీసుకోవాలి..

ఈ సర్వే నంబర్​లో చెరువు వరద నీరు వచ్చే కాలువ పోతుందనే విషయం తెలిసి కూడా మహబూబ్​నగర్  అర్బన్  డెవలప్​మెంట్ అథారిటీ(ముడా) అధికారులు వెంచర్  ఏర్పాటుకు పర్మిషన్  ఎలా ఇచ్చారని, ఇరిగేషన్ ఆఫీసర్లు ఈ ల్యాండ్​కు ఎన్ వోసీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ భూమిలో అక్రమంగా మట్టి తెచ్చి పోశారని వారాహి సంస్థకు రూ.5.12 కోట్ల జరిమానా  విధించారని తెలిపారు. 

కానీ, గతంలో ఇక్కడ పని చేసి జనగామ జిల్లాకు బదిలీ అయిన అప్పటి మైనింగ్​ ఏడీ బదిలీకి ఒక రోజు ముందు ‘అక్కడ ఉన్న మట్టి మొత్తం అక్కడే తవ్వి పోశారని, అందుకే ఆ జరిమానాను వారాహి సంస్థ చెల్లించాల్సిన అవసరం లేదు’ అని ఉత్తర్వులు ఇచ్చి వెళ్లిపోయారని గుర్తు చేశారు. ప్రస్తుతం అక్కడున్న మట్టి మొత్తం బయటి నుంచి అక్రమంగా తెచ్చి పోశారని కమిటీ నిర్ధారించిందని, ఈ నేపథ్యంలో అప్పటి ఏడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు. దీనిపై తాను చీఫ్  సెక్రటరీకి  కంప్లైంట్ చేస్తానన్నారు. , పూడ్చిన కాల్వను అక్కడే తవ్వించి, ధ్వంసం చేసిన శ్మాశానవాటిక భూమిని పరిరక్షించాలని ఉన్నతాధికారులను కోరుతానని ఎమ్మెల్యే తెలిపారు.