గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి పెద్ద పెద్ద డిజిటల్ కంపెనీలకు వేసే పన్నులను పెంచాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అందుకు తగ్గట్టు దేశ పన్ను చట్టాల్లో మార్పులు చేయాలంటున్నారు. ఇప్పటికే పెద్ద కంపెనీలు కొన్నేళ్లుగా పన్ను ఎగవేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కంపెనీల పన్ను విధానాలను మార్చాల్సిన అవసరముందని ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) బుధవారం ప్రతిపాదించింది. బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్‌పై సమ్మిళిత ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా పన్నుల్లో మార్పులు చేయాలని చెప్పింది. ఓఈసీడీ/జీ20 దేశాల్లోని భాగస్వాములైన 134 దేశాలు అభిప్రాయం చెప్పాలని సూచించింది. ప్రస్తుతం ఓఈసీడీలో ఇండియా సభ్య దేశం కాదని, కాబట్టి దేశ పన్ను చట్టాల్లో మార్పులు చేయడంలో వేగం పెంచాలని సైబర్ నిపుణులు కోరుతున్నారు. ‘‘ఇంటర్నెట్ కంపెనీలపై పన్ను వేయాలని ప్రభుత్వాలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాయి. కానీ ఎలా వేయాలో నిర్ణయం తీసుకోవట్లేదు” అని ప్రముఖ సైబర్ లా నిపుణుడు, సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ పవన్ దుగ్గల్ అన్నారు. వివిధ దేశాల్లో వ్యాపారం చేస్తున్న ఇంటర్నెట్ కంపెనీలు పన్నులను కట్టట్లేదని, దాని వల్ల కంపెనీలు బాగా లాభపడుతున్నాయే గానీ దేశానికి ఏం లాభం లేదని అన్నారు. చైనా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఇప్పటికే ఈ దిశగా చర్యలు తీసుకున్నా ఇండియా ముందుకెళ్లట్లేదని మరో లాయర్ విరాగ్ గుప్తా అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లలో మార్పులు చేయాలని సూచించారు. ఇలా చేస్తే మన ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు.

