మరోసారి రాళ్ల దాడి.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కిటికీలు ధ్వంసం

మరోసారి రాళ్ల దాడి.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కిటికీలు ధ్వంసం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరో సారి రాళ్ల దాడి జరిగింది. ఒడిశాలో నవంబర్ 26న గుర్తు తెలియని దుండగులు రూర్కెలా-భువనేశ్వర్ (20835) రైలును లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని దెంకనల్-అంగుల్ రైల్వే సెక్షన్‌లో మెరమండలి -బుధపాంక్ మధ్య ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌ కిటికీలు దెబ్బతిన్నాయని వారు తెలిపారు.   

ఈ ఘటనపై విధి నిర్వహణలో ఉన్న ఆర్పీఎఫ్ ఎస్కార్టింగ్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ (ECoR) భద్రతా విభాగం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP)ని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే కటక్ నుంచి ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించామని, రాళ్ల దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. స్థానిక పోలీసులతో సమన్వయంతో ECoR భద్రతా విభాగం రెండూ నిందితులను గుర్తించే పనిలో ఉన్నాయని చెప్పింది.