అసెంబ్లీలో ఆత్మహత్యాయత్నం చేసిన ఎమ్మెల్యే

అసెంబ్లీలో  ఆత్మహత్యాయత్నం చేసిన ఎమ్మెల్యే
  • రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన
  • శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసిన బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ చంద్ర పానిగ్రహి

అసెంబ్లీ సాక్షిగా ఓ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఒడిశాలో అసెంబ్లీలో జరిగింది. రాష్ట్రంలో వరి కొనుగోలు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సుభాష్ చంద్ర పానిగ్రహి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఒడిశాలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో డియోగర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పానిగ్రహి రైతుల సమస్యల గురించి మంత్రిని ప్రశ్నించాడు. అందుకు బదులుగా ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి రణేంద్ర ప్రతాప్ స్వైన్ సభకు సమాధానమిస్తుండగా.. సభలో సభ్యుల కోసం ఏర్పాటుచేసిన శానిటైజర్ తీసుకొని ఒక్కసారిగా తాగబోయాడు. వెంటనే స్పందించిన తోటి శాసనసభ్యులు.. పానిగ్రహి నుంచి శానిటైజర్ లాక్కొని ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. 

‘రాష్ట్ర ప్రభుత్వం నాకు వేరే మార్గం లేకుండా చేసింది. రైతుల సమస్యలపై ఎన్నిసార్లు గొంతు వినిపించినా ప్రభుత్వం స్పందించడంలేదు. రైతుల దుస్థితిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. అందుకే నేను శానిటైజర్ తాగడానికి ప్రయత్నించాను’ అని సుభాష్ చంద్ర పానిగ్రహి తెలిపారు.  రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పానిగ్రాహి ఆరోపించారు.