దేశంలో రెండో దశ కరోనా పెరుగుతోంది. గత వారం రోజుల తీరు గమనిస్తే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హరియాణా, పంజాబ్ తదితర 19 రాష్ట్రాల్లో ఈ పెరుగుదల నమోద వుతోంది. వారం క్రితం కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఈ ధోరణి కనబడింది. మరణాల సంఖ్య కూడా ఆ మేరకు పెరుగుతోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా తదితరచోట్ల కొన్ని ప్రాంతాల్లో మళ్లీ రాత్రి పూట కర్ఫ్యూ విధించటం మొదలుపెట్టారు. తాజాగా గుజరాత్ లో కూడా కరోనా కేసులు పెరుగుతుండడంతో అహ్మదాబాద్ నగరపాలక సంస్థ కరోనా నియంత్రణ కోసం నగరంలోని పార్కులు, గార్డెన్‌లను మూసివేయాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత దృష్ట్యా ఆ రాష్ట్రంలో 1 నుంచి 8 తరగతుల విద్యార్ధులందర్నీ ఈ ఏడాది పరీక్షలు నిర్వహించకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో 2020-2021 ఏడాదికి గాను విద్యార్ధులందరు పాస్ చేస్తున్నట్లు తెలిపింది.
