భువనేశ్వర్(ఒడిశా): టైముకు బస్సు లేకపోవడం వల్ల రోజూ స్కూలుకు లేటవుతుందంటూ ఓ బుల్లి స్టూడెంట్ చేసిన ట్వీట్‌కు ఒడిశా అధికారులు ఏకంగా బస్సు టైమింగ్‌ను మార్చేసిన్రు. రోజూ స్కూలుకు వెళ్లి బాగా చదువుకొమ్మని సలహా ఇచ్చిన్రు. ఒడిశా రాజధానిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు.. భువనేశ్వర్‌కు చెందిన సాయి అన్వేష్ అమృతం ప్రధాన్ ఎంబీఎస్ స్కూల్లో చదువుకుంటుండు. ఇంటి నుంచి రోజూ ‘మో బస్’(క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ భువనేశ్వర్– సీఆర్ యూటీ ఆధ్వర్యంలో నడిచే బస్సు) లో స్కూలుకు పోయొస్తడు. ఇటీవల అధికారులు ఆ బస్సు టైమింగ్‌ను మార్చేశారు. దీంతో లింగిపూర్ నుంచి ఫస్ట్ బస్ ఉదయం 7:40 నిమిషాలకు బయలుదేరుతుంది. ఈ టైమింగ్ మార్చడం వల్ల తను స్కూలుకు ఇన్టైమ్లోగా వెళ్లలేకపోతున్నానని సాయి చెబుతున్నాడు. తన స్కూలు ఉదయం 7:30 కే స్టార్ట్ అయితదన్నడు. రోజూ ఆలస్యంగా వెళ్లడం వల్ల పాఠాలు పోతున్నయని వాపోయాడు. దీనిపై సీఆర్యూటీ అధికారులు, ఎండీ అరుణ్ బోత్రాకు సాయి ట్వీట్ పెట్టిండు. ‘సార్.. నా పేరు సాయి అన్వేష్ అమృతం ప్రధాన్. నేను ఎంబీఎస్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న. రోజూ ‘మో బస్’లోనే స్కూలుకు పోయొస్త. కానీ, మా ఏరియా నుంచి బయలుదేరే బస్సు టైమింగ్‌ను ఇటీవల మార్చిన్రు. దీంతో నేను స్కూలుకు లేటవుతున్నా’ అని ట్వీట్ చేసిండు. సాయి రిక్వెస్ట్ ఆకట్టుకోవడంతో నెటిజన్లు ట్వీట్‌ను వైరల్ చేసిన్రు. దీంతో సీఆర్యూటీ అధికారులు స్పందించారు. సీఆర్యూటీ ఎండీ, ఐపీఎస్ ఆఫీసర్ అరుణ్ బోత్రా జవాబిస్తూ.. ‘డియర్ సాయి. నీలాంటి ప్రయాణికులను ‘మో బస్’ ప్రేమతో గమ్యం చేరుస్తోంది. సోమవారం నుంచి మీ ఏరియాకు వచ్చే బస్ టైమింగ్ మారింది. ఫస్ట్ బస్సు ఉదయం 7 గంటలకే అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇకపై నువ్వు స్కూలుకు లేట్‌గా వెళ్లక్కర్లేదు’ అని ట్వీట్ చేశారు.
