లబ్దిదారుల అకౌంట్లలోకి ఏటా 72 వేలు వేస్తం
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్‌ను గెలిపిస్తే.. మినిమమ్ ఇన్ కమ్ స్కీమ్ అయిన న్యూనతమ్ ఆయ్ యోజన (న్యాయ్)ను అమలు చేస్తామని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఊమెన్ చాందీ పోటీ చేస్తున్న పుత్తుప్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళవారం రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'కేరళలో 'న్యాయ్' ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం. ఈ స్కీమ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఏడాదికి రూ.72 వేలు చొప్పున లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వేస్తాం. ఇది చారిటీ కాదు. న్యాయ్ ద్వారా డబ్బులు ఇస్తాం. డబ్బులను మీ జేబుల్లో పెడుతం. మీరు వాటిని ఖర్చు పెట్టుకోవచ్చు. డీమానిటైజేషన్, జీఎస్టీ అమలు, కరోనా కారణంగా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు ఇదొక్కటే దారి'అని అన్నారు. 2019 లోక్ సభ ఎన్నిక సమయంలో రాహుల్ ఈ స్కీమ్ ను ప్రకటించారు. దేశంలో పేదరికాన్ని ఓడించేందుకు ఇది అద్భుతమైన పథకమని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో ఈ స్కీమ్ మేనిఫెస్టోకే పరిమితమైంది.
