మెదక్ లో నర్సింగ్, పారా మెడికల్ కోర్సులు..వైద్య మంత్రి మాటిచ్చిన నెలలోపే అమలు

  • ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభం 

మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏర్పాటు కాగా దానికి అనుబంధంగా నర్సింగ్, పారా మెడికల్ కోర్సులు ప్రారంభం కానున్నాయి. 2023లో అప్పటి ప్రభుత్వం మెదక్ పట్టణంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మంజూరు చేసింది. గతేడాది సెప్టెంబర్ లో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. కాగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోవడంతో మెడికల్ కాలేజీ ఏర్పాటు అవుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకు రావడంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్ రావుల కృషి,  కలెక్టర్ రాహుల్ రాజ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రవీందర్ చొరవతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) గైడ్ లైన్స్ కు అనుగుణంగా అవసరమైన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్లు, ఇతర సిబ్బంది పోస్టులు భర్తీ కావడంతో పాటు, మౌలిక వసతులు సమకూరడంతో 50 సీట్లతో మెడికల్ కాలేజీకి అనుమతి లభించింది. ఈ మేరకు అడ్మిషన్లు పూర్తి కావడంతో గత నెల 24న మంత్రి దామోదర చేతుల మీదుగా మెదక్ మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. ఈ  సందర్భంగా మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు సైతం మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. 

నెల రోజుల్లోపే నర్సింగ్ కాలేజీ 

మెడికల్ కాలేజీ ప్రారంభమైన నెల రోజుల్లోపే  దానికి అనుబంధంగా గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ మంజూరైంది. ఈ కాలేజీలో 60 సీట్లు ఉంటాయి. ఈ ఏడాది నుంచే నర్సింగ్ కాలేజీలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రిన్సిపాల్ ను నియమించడంతో పాటు అడ్మిషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. కొత్త నర్సింగ్ కాలేజీని మెడికల్ కాలేజీ సమీపంలోని ఓ ప్రైవేట్ బిల్డింగ్ లో ఏర్పాటు చేయనుండగా త్వరలోనే తెలంగాణ స్టేట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్​మెంట్​కార్పొరేషన్ (టీఎస్ఏంఐడీసీ) ఆధ్వర్యంలో ఫర్నిచర్, తదితర మౌలిక వసతులు సమకూర్చనున్నారు. ఇంటర్ లో బైపీసీ చదివి, ఎంట్రెన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి మెరిట్ ఆధారంగా నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్  కల్పిస్తారు.   

పారా మెడికల్ కోర్సులు సైతం

తెలంగాణ పారా మెడికల్ బోర్డు సెక్రటరీ నోటిఫికేషన్ కు అనుగుణంగా మెదక్  ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 2024 –- 25 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లమా ఇన్ అనస్తీషియా టెక్నీషియన్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా కోర్సుల్లో ప్రవేశానికి  అర్హులైన స్టూడెంట్స్​నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులకు అవకాశం ఉందని మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ రవీందర్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులకు ఆయా కోర్సుల్లో అడ్మిషన్ కల్పిస్తామని తెలిపారు.