ముంబై: ఎన్ఎస్ఈ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ చిత్రా రామక్రిష్ణకు ఏడు రోజులపాటు సీబీఐ కస్టడీకి పంపాలని సోమవారం సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కో లొకేషన్ స్కాములో భాగం ఉందనే ఆరోపణలతో ఆదివారం రాత్రి చిత్రా రామక్రిష్ణను అరెస్టు చేశారు. అడిగే ప్రశ్నలకు చిత్రా రామక్రిష్ణ జవాబులు దాటవేస్తుండటంతో 14 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీబీఐ కోరింది. ఇతర నిందితులను కూడా అరెస్టు చేస్తామని ఈ కేసు విచారణ సందర్భంగా సీబీఐ కోర్టుకు సీబీఐ తెలిపింది. నాలుగేళ్లలో ఇద్దరు నిందితులను మాత్రమే అరెస్టు చేయడంపైనా కోర్టు ఆరా తీసింది. దాదాపు 2,500 ఈమెయిల్స్ దాకా ఉన్నాయని, వీటిపై వివరాలు తెలుసుకోవడానికి చిత్రా రామక్రిష్ణను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీబీఐ తరఫు లాయర్ కోరారు. చిత్రా రామక్రిష్ణ దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ను శనివారం నాడు కోర్టు తిరస్కరించింది.
