ఎండాకాలం కరెంట్ కష్టాలకు ముందస్తు చెక్

  • గత వేసవి బ్రేక్ డౌన్​లపై రివ్యూ
  • బ్రేక్ డౌన్ రెక్టిఫికేషన్ టీంల ఏర్పాటు
  • మున్సిపాలిటీల్లో రింగ్ మెయిన్స్ వ్యవస్థ
  • హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్లకు ఎమర్జెన్సీలో ప్రత్యామ్నాయ కరెంటు సరఫరా..

నిర్మల్, వెలుగు : రాబోయే ఎండాకాలంలో కరెంటు కష్టాలు తలెత్తకుండా ఎన్పీడీసీఎల్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. గత వేసవిలో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో తరచూ బ్రేక్ డౌన్లు ఏర్పడి కరెంటు సరఫరాకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే వేసవిలో బ్రేక్​డౌన్లు ఏర్పడకుండా కాంగ్రెస్​ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే గత వేసవిలో జరిగిన బ్రేక్ డౌన్లపై విశ్లేషించి దానికనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. 

బ్రేక్ డౌన్ జరగకుండా చర్యలు

గతేడాది కాలం పాటు జరిగిన కరెంటు సరఫరా లోడ్ ను ట్యాంగ్ టెస్టర్ రీడింగ్ తో లెక్కించబోతున్నారు. గతేడాది మొత్తం ఎంత కరెంట్ వినియోగం జరిగిందనే అంశంతో పాటు అప్పుడు ఎంత మేర కరెంట్ వినియోగం అయ్యిందనే వివరాలు తెలుసుకోనున్నారు. దీనికి అనుగుణంగా రాబోయే ఎండాకాలంలో కరెంట్ డిమాండ్ ఎంత మేరకు పెరిగే అవకాశముంటుందనే దానిపై నివేదికలు సిద్ధం చేయనున్నారు.

వేసవిలో ఎక్కడా బ్రేక్ డౌన్ జరగకుండా చర్యలు తీసుకోబోతున్నారు. ఇందుకు ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో బ్రేక్ డౌన్ రెక్టిఫికేషన్ టీమ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, పోలీస్ స్టేషన్లకు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

మున్సిపాలిటీల్లో నిరంతర సరఫరా

మున్సిపాలిటీ ప్రాంతాల్లో నిరంతరంగా కరెంట్ సరఫరా జరిగేట్లు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం రింగ్ మెయిన్స్ వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నారు. 11 కేవీ ఫీడర్లకు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాల ద్వారా విద్యుత్ సరఫరా చేయనున్నారు. గతేడాది కరెంటు సరఫరా, డిమాండ్, వినియోగాన్ని లెక్కించి దానికి అనుగుణంగా ఈసారి వేసవిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేయాలని నిర్ణయించింది.

నిర్మల్ జిల్లాలో ఓవర్ లోడ్ ను తగ్గించేందుకు 127 కొత్త ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయడమే కాకుండా  38 ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచనున్నారు. 33 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్స్ వ్యవస్థను మరింత పటిష్టం చేయబోతున్నారు. అత్యవసర సమయాల్లో 33 / 11 కెవి సబ్ స్టేషన్ లకు ప్రత్యామ్నాయ ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని నిర్ణయించారు. అలాగే జిల్లాలోని 532 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లకు ముందస్తు రిపేర్లు చేపట్టి వాటి సామర్థ్యాన్ని పెంచబోతున్నారు.