సోషల్ మీడియా పోస్టుల కేసు.. సజ్జల భార్గవ్ రెడ్డి తల్లికి నోటీసులు

సోషల్ మీడియాలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోం మంత్రి వంగలపూడి అనితపై అసభ్యకర పోస్టుల పెట్టిన కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డికి నోటీసులిచ్చారు పులివెందుల పోలీసులు. వీరితోపాటు 15 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మంగళగిరికి వెళ్లిన పులివెందుల పోలీసులు.. సజ్జల భార్గవ్ రెడ్డి తల్లికి నోటీసులు అందజేశారు.అనంతరం పులివెందులలో అర్జున్ రెడ్డికి నోటీసులు అందించారు. 

సోమవారం ( నవంబర్ 25) విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై నవంబర్ 8న ఐటీ, బీఎన్ ఎస్ , అట్రాసిటీ చట్టాల కింద పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఏ1గా వర్రా రవీందర్ రెడ్డి, ఏ2గా సజ్జల భార్గవ్ రెడ్డి, ఏ3గా అర్జున్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో తాజాగా మరో 15 మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు.

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో వర్రా రవీందర్ రెడ్డిపై ఏపీతోపాటు తెలంగాణలో కూడా పలు కేసులు నమోదు అయ్యాయి. నవంబర్ 8న పులివెందుల పోలీస్ స్టేషన్ లో నమోదైన అట్రాసిటీ కేసులో వర్రా రవీందర్ రెడ్డి కడప జైల్లో రిమాండ్ లో ఉన్నారు. వర్రాపై ఏపీ వ్యాప్తంగా 40 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.