ఉల్లిపాయ రసంతో జుట్టు పదిలం.. చుండ్రు మాయం

ఉల్లిపాయ రసంతో జుట్టు పదిలం.. చుండ్రు మాయం

జుట్టు రాలడాన్ని నయం చేసే ఉల్లిపాయ రసం: ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను నయం చేస్తుంది. ఉల్లిపాయకు సంబంధించిన చాలా ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. ముఖ్యంగా ఉల్లిపాయ నూనె... జుట్టు రాలడం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. కానీ నిపుణుడు జావేద్ హబీబ్ చెప్తున్నదేమిటంటే.. ఉల్లిపాయ నూనె కాకుండా..  ఉల్లిపాయ రసం జుట్టు రాలడాన్ని పూర్తిగా నివారిస్తుందంటున్నారు. ఇది జుట్టు పెరుగుదలకు ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు.

జుట్టుకు ఉల్లిపాయ రసాన్ని ఎలా అప్లై చేయాలి?

మెరుగైన జుట్టు కోసం ఉల్లిపాయను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. దీని కోసం, మీరు చేయాల్సిందల్లా ఉల్లిపాయ రసాన్ని తీసి నేరుగా మీ జుట్టుకు పట్టించండి. మీరు మీ జుట్టుకు ఉల్లిపాయ నూనెను పూయవలసిన అవసరం లేదు, కేవలం రసమే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాదు జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.

ఉల్లిపాయ రసం ఎన్ని రోజులు ఉపయోగించాలి?

ఆశించిన ఫలితాలను పొందడానికి మీరు మీ జుట్టుకు ఈ ఉల్లిపాయ రసాన్ని 8 వారాల పాటు అప్లై చేయాలని జావేద్ హబీబ్ చెబుతున్నారు. షాంపూ చేయడానికి ముందు ప్రతిరోజూ వారానికి ఒకసారి అప్లై చేయాలని, తేడాను గమనించాలని సూచిస్తున్నారు.

జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాలు:

1. జుట్టు పొడవుగా..

ఉల్లిపాయతో జుట్టుకు చాలా ప్రయోజనాలున్నాయి. ముందుగా ఇది మీ తలలో రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది. దీంతో జుట్టుకు పోషకాలు అందడంతో పాటు పొడవుగా పెరుగుతుంది. వీటితో పాటు ఇది జుట్టు మూలాలలోని హైడ్రోజన్ పెరాక్సైడ్ ను తగ్గిస్తుంది. దీని కారణంగా జుట్టు తెల్లబడదు.

2. జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది

జుట్టు రాలడం, చుండ్రును తగ్గించడంలో ఉల్లిపాయ రసం చాలా ఉపయోగపడుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది. జుట్టులో చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడం ద్వారా స్కాల్ప్ క్లెన్సింగ్‌లో ఇది సహాయపడుతుంది. దీంతో పాటు ఇది జుట్టుకు యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.