విమానాల్లో సగం సీట్లు కూడా నిండట్లేదు

విమానాల్లో సగం సీట్లు కూడా నిండట్లేదు

కేంద్ర ప్రభుత్వం రెండు నెలల లాక్​డౌన్ తరువాత విమానాలను నడుపుకోవడానికి పర్మిషన్లు ఇచ్చినా ఈ కంపెనీలకు ఫలితం కనిపించడం లేదు. గత నెల 25 నుంచి విమానాలు మొదలయ్యాయి. అయితే కరోనా భయం, ఎక్కువ రేట్ల వల్ల జనం విమాన ప్రయాణానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ప్రస్తుతం విమానంలో ఒక వరుసలో ఇద్దరు కూర్చోవడానికే మాత్రమే అనుమతిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ రూల్స్ అన్నింటినీ పాటిస్తున్నారు. ఎయిర్​పోర్టుల్లో థర్మల్​ స్క్రీనింగ్ చేస్తున్నారు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారు. అయినా విమాన ప్రయాణికుల సంఖ్య పెరగడం లేదు. ఇప్పటికీ మొత్తం సీట్లు నిండటం లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) లెక్కలు చెబుతున్నాయి. ఇండియా ఏవియేషన్ సెక్టార్లో మార్కెట్ లీడర్ అయిన ఇండిగో మే నెలలో 52.6 శాతం సీట్లకు మాత్రమే టికెట్లు అమ్మగలిగింది. అంటే ప్రతి రెండు సీట్లకు ఒక్క టికెట్ మాత్రమే అమ్ముడయింది. కరోనాకు ముందు తమ మార్కెట్ షేరు బాగానే ఉండేదని, ఇప్పుడు అది 17.1 శాతం మాత్రమే ఉందని స్పైస్​జెట్ ఎండీ అజయ్ సింగ్ చెప్పారు. విమానాల్లో 57.2 శాతం సీట్లు మాత్రమే నిండుతున్నాయని తెలియజేశారు. ఇక ప్రభుత్వానికి చెందిన ఎయిరిండియా ప్యాసింజర్ లోడ్ ప్యాక్టర్ 54 శాతంగా, మార్కెట్ షేరు 17.3 శాతంగా రికార్డయింది. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్​లైన్స్​ ఉమ్మడిగా నిర్వహించే విస్తారా ఎయిర్​లైన్స్​ లోడ్​ఫ్యాక్టర్ 44.1 శాతంగా, మార్కెట్ షేరు 6.5 శాతంగా ఉంది. ఎయిర్ ఏషియా 46 శాతం సీట్లను మాత్రమే అమ్మగలిగింది. మార్కెట్ షేరు కేవలం 6.5 శాతం ఉంది. వాడియా గ్రూపునకు చెందిన గోఎయిర్ ఈ నెల ఒకటి నుంచి సర్వీసులను తిరిగి మొదలుపెట్టింది.