వనపర్తి జిల్లా లో విద్యుత్తు శాఖలో ఆగని మామూళ్లు

  • లైన్ మెన్  నుంచి ఎస్ ఈ  వరకు కమీషన్ల వసూలు

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా విద్యుత్ శాఖలో  చేయి తడపందే పని కావడం లేదు.  శుక్రవారం విద్యుత్ శాఖ ఎస్ఈ, డీఈ, ఏఈలు ఒక రెస్టారెంట్ కు కనెక్షన్ ఇవ్వడం కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో  చిక్కుకున్నారు.  విద్యుత్ శాఖలో లైన్ మెన్ నుంచి ఎస్ఈ వరకు ప్రతి పనికి ఓ రేటును వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.  ఇంటికి కరెంటు మీటరు ఇవ్వడానికి  కేటగిరీని బట్టి నిర్ధారిత డీడీ అమౌంట్ తో  పాటు వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారు. రైతులకు పొలాల వద్ద ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే వారి నుంచి నిర్ధారిత ఫీజు కంటే రూ.1500 నుంచి 2 వేల దాకా ఎక్కువ వసూలు చేస్తున్నారు.  

లక్షకు 13 శాతం కమీషన్ 

కాంట్రాక్టర్ ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేసి లైను లాగేందుకు ఇచ్చే ఎస్టిమేషన్ మీద లక్ష రూపాయలకు 13 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఎస్ఈకి ఐదు శాతం, డీఈకి ఐదు శాతం, సిబ్బందికి మూడు శాతం చొప్పున కమిషన్ ఇవ్వాల్సిందే అంటూ కాంట్రాక్టర్లు బహిరంగంగానే చెబుతున్నారు. పనుల ఎస్టిమేషన్‌‌‌‌‌‌‌‌ కు కమిషన్ ఇవ్వాల్సి వస్తుందని కొందరు కాంట్రాక్టర్లు ఎస్టిమేషన్ విలువను పెంచి శాంక్షన్ తీసుకుంటున్నారు.

 వనపర్తి జిల్లాలో గత ఐదేళ్లలో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్లు,  ఇచ్చిన విద్యుత్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌  ఫార్మర్ లు, ఇతర పనుల పై రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులతో విచారణ చేస్తే విద్యుత్ శాఖ అధికారుల అవినీతి, అక్రమాలు మరింతగా వెలుగుచూసే అవకాశం ఉంది.   వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణ సమయంలో అప్పటి అధికార  బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు కుమ్మక్కై  విద్యుత్ స్తంభాల తొలగింపు, కొత్త స్తంభాల ఏర్పాటు తదితర పనుల్లో భారీగా అవినీతికి పాల్పడి కమీషన్లు పంచుకున్నట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి. 

స్క్రాప్ ను వదలని విద్యుత్ శాఖ అధికారులు..

వనపర్తిలో రోడ్ల విస్తరణ చేపట్టినప్పుడు తీసేసిన కరెంటు స్తంభాలు, ఇతర వైర్లు విద్యుత్ శాఖ అధికారులకు వాపసు చేయాల్సి ఉండగా వాటిని ఇవ్వకుండా స్క్రాప్ కింద అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జనవరిలో స్తంభాలను కట్ చేసి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని విద్యుత్ శాఖ అధికారులకు అప్పగించారు. అయినా ఆ కేసు ఇంతవరకు తేలలేదు. 

అదే విధంగా స్క్రాప్ కింద తొలగించిన స్తంభాలను వనపర్తి మండలంలో ఓ కంపెనీకి తక్కువ రేటుకు విద్యుత్ శాఖ అధికారి ఒకరు అందించినందుకు గాను ఆ కంపెనీ ఆ అధికారికి పెద్ద మొత్తంలో సాయంచేసినట్టుగా ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి  మార్చి నెల ఆఖరులో ఒక లారీలో వనపర్తి నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు కరెంటు వైర్లు, ఇతర సామగ్రిని తరలిస్తుండగా షాద్ నగర్ వద్ద కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఆపి పేపర్లను అడిగినా ఇవ్వలేదు. ఎలాంటి అనుమతులు లేవని లారీ సామగ్రిని జప్తు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  వనపర్తి  విద్యుత్ శాఖ కు చెందిన డీఈ స్థాయి అధికారి మరుసటి రోజు ఆ సరుకు తమ శాఖ దేనని అధికారులకు నచ్చజెప్పడం సంచలనంగా మారింది.  పైగా స్క్రాప్  పేరుతో వనపర్తి నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తరలిస్తున్నామంటూ కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు ఒక లెటర్  ఇచ్చి స్క్రాప్ ను తరలించిన కాంట్రాక్టర్ ఫేవర్ చేశాడు.  ఇలా వనపర్తి జిల్లా విద్యుత్ శాఖలో ప్రతి పనికి ఒక రేటు దానిపైనా కమిషన్ వసూలు చేస్తున్న విషయాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు, అప్పటి బీఆర్ఎస్ లీడర్లు గుట్టు చప్పుడు కాకుండా సెటిల్ మెంట్లు చేసుకున్నా  బయటపడని సంఘటనలు ఇంకా ఎన్నో ఉన్నాయి.