న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై అన్నదాతల డిమాండ్ల పరిష్కారం దిశగా రైతు సంఘాలకు కేంద్రం కొన్ని ప్రతిపాదనలు పంపింది. అయితే రైతు సంఘాల నుంచి ఇప్పటిదాకా ఎలాంటి జవాబు రాలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఈ చట్టాలపై సవరణలకు మొగ్గు చూపుతూ బుధవారం రైతు సంఘాలకు కేంద్రం ప్రతిపాదనలు పంపామన్నారు.
‘మేం రైతులతో చర్చలు జరిపాం. మేం వారికి కొన్ని ప్రతిపాదనలు పంపాం. కానీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అన్నదాతలు మా ప్రతిపాదనలను తిరస్కరించారన్న విషయం మాకు మీడియా ద్వారా తెలిసింది. ఈ ప్రతిపాదనల గురించి వారు మాతో చర్చించాలనుకుంటే అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఆందోళనతో సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ జనాలు తీవ్ర ఇబ్బందులు ఫేజ్ చేస్తున్నారు. అందుకే రైతులు తమ ఆందోళనలకు స్వస్తి చెప్పాలి. ప్రజల ఆసక్తులను దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సహకరించాలి’ అని తోమర్ చెప్పారు.
