అసెంబ్లీ రద్దు ఆలోచన లేదన్నారు

అసెంబ్లీ రద్దు ఆలోచన లేదన్నారు

మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు కంటిన్యూ అవుతున్నాయి. రెండో రోజు కూడా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మహారాష్ట్ర క్యాబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. సీఎం ఉద్దవ్ థాక్రేకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి 8 మంది మంత్రులు హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కలిసి కట్టుగా ఉన్నారని, అసెంబ్లీ రద్దు చేసే ఆలోచన లేదని ఉద్దవ్ థాక్రే అన్నారని కాంగ్రెస్ నేత కమల్ నాథ్ వెల్లడించారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం వేళ.. అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు.. చక్కబెట్టేందుకు ఏఐసీసీ పరిశీలకుడిగా సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను కాంగ్రెస్ అధిష్టానం పంపించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతలు ఐక్యతతో ఉన్నారని, తమ ఎమ్మెల్యేలు అమ్మకానికి లేరంటూ ఆయన మరోసారి స్పష్టం చేశారు. తనతో 40 మంది ఎమ్మెల్యేలున్నారని షిండే చేస్తున్న వ్యాఖ్యలను కొట్టిపారేశారు.

శివసేనకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. మహావికాస్ అఘాడీ (MVA) సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్యపక్షాలు ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకొంటోంది. 5 గంటలకు శివసేన ఎమ్మెల్యేలు భేటీ కానునాన్నరు. సమావేశానికి అందరూ రావాల్సిందేనని శివసేన విప్ జారీ చేసింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే.. పలువురు ఎమ్మెల్యేలతో కలిసి సూరత్ నుంచి గౌహతికి మకాం మార్చారు. తనతో 40 మంది ఎమ్మెల్యేలున్నారని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని.. ఉమ్మడిగా పాలించాలని తాను కోరుకోవడం జరుగుతోందని ఆయన వెల్లడించినట్లు సమాచారం. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతలు షిండేని కలిసినట్లు తెలుస్తోంది.