కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో మోహరించిన రైతులు తమ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మరోవైపు విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టాలతో అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకే మేలు జరుగుతుందని, రైతులు నాశనం అవుతారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక ప్రకటన చేసింది. కార్పొరేట్ వ్యవసాయం లేదా కాంట్రాక్ట్ వ్యవసాయంలోకి తాము ప్రవేశించబోమని స్పష్టం చేసింది. రైతుల నుంచి వ్యవసాయ భూములను కొనుగోలు చేసే ఆలోచన కూడా తమకు లేదని స్పష్టం చేసింది రిలయన్స్ సంస్థ.
రైతుల నుంచి తాము నేరుగా పంటను కొనుగోలు చేయబోమని… తమ సరఫరాదారులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తారని రిలయన్స్ తెలిపింది. రైతులకు వారి పంటకు లాభదాయకమైన ధర లభించాలనేదే రిలయన్స్, దాని సంబంధిత సంస్థలు కోరుకుంటున్నామని చెప్పింది. కనీస మద్దతు ధరకు కట్టుబడి ఉండాలని తమ సరఫరాదారులను కూడా కోరుతున్నామంది.
