మమతా బెనర్జీపై ఎవరూ దాడి చేయలేదు

మమతా బెనర్జీపై ఎవరూ దాడి చేయలేదు

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఎవరూ దాడి చేయలేదని.. అది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన మాత్రమేనని ఎన్నికల సంఘం పరిశీలకులు తన నివేదికలో స్పష్టం చేశారు. ఆమెపై ఎవరూ దాడి చేయలేదని ఈసీకి నివేదికలో చెప్పారు. కారు డోర్‌ను తెరిచి ఉంచి.. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో.. కారు డోర్‌ ఓ పిల్లర్‌కి తగిలి, బలంగా మూసుకుందని తెలిపారు. అది బలంగా మూసుకోవడం కారణంగానే మమత కాలికి గాయాలయ్యాయని చెప్పారు.

మూడు రోజుల క్రితం నందిగ్రామ్ ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గాయాల పాలవడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. తనపై కొంత మంది వ్యక్తులు దాడి చేశారని మమత చెబుతుంటే..సానుభూతి కోసమే డ్రామాలాడుతున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం.. ఆ రోజు నందిగ్రామ్‌లో ఏం జరిగిందన్న దానిపై ఈసీ ఆరాతీసింది. నిజ నిర్ధారణ కోసం ప్రత్యేక పరిశీలకును నియమించింది. ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులు వివేక్ దుబే, అజయ్ నాయక్ పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌కు వెళ్లి ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యక్ష సాక్షలతో మాట్లాడడంతో పాటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆ తర్వాత ఈసీకి నివేదిక సమర్పించారు.