పైసలు లేక.. కిస్తీలు కట్టలేక..

పైసలు లేక.. కిస్తీలు కట్టలేక..

పెరుగుతున్న ఆటో డెబిట్​ బౌన్స్​రేటు

​అన్నిబ్యాంకుల్లోనూ ఇదే పరిస్థిత

న్యూఢిల్లీ: కరోనా, ఎకానమీ క్రైసిస్ జనం జేబులను గుల్ల చేస్తున్నాయి. వ్యాపారులు, ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందేవాళ్లు బ్యాంకు కిస్తీలు కట్టలేకపోతున్నారని వెల్లడయింది. లోన్లు, ఇన్వెస్ట్మెంట్లు, బిల్ పేమెంట్స్ కోసం బ్యాంకులు ఆటో డెబిట్ సిస్టమ్ ను వాడుతాయి. ప్రతి నెలా ఏదో ఒక తారీఖున అకౌంటు నుంచి డబ్బు డెబిట్ అవుతుంది. అయితే మెజారిటీ ఆటో డెబిట్ ట్రాన్సాక్షన్లు ఫెయిలవుతున్నాయి. ఇలాంటి ట్రాన్సాక్షన్ల బౌన్స్ రేటు భారీగా పెరిగిందని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా వెల్లడించింది. జనం దగ్గర డబ్బు లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆటో డెబిట్ రిక్వెస్ట్ తిరస్కరణకు గురికావడాన్ని బౌన్స్ అంటారు. కస్టమర్ల అకౌంట్లలో డబ్బులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని బ్యాంకర్లు, ఇండస్ట్రీ ఎక్స్పర్టులు కూడా అంటున్నారు. ఆరు నెలల మారిటోరియమ్ ఎంచుకున్న అకౌంట్లకు ఆటో డెబిట్ రిక్వెస్టులు వస్తున్నాయనే కంప్లెయింట్లూ ఉన్నాయి.

అసలు ఏం జరుగుతోంది ?

ఆటోడెబిట్ రిక్వెస్టులో 80 శాతం లోన్లకు సంబంధించినవే ఉంటున్నాయి. వీటిలో 30 శాతం రిటైల్ లోన్ పేమెంట్లు ఉన్నాయి. వీటి ఆటో డెబిట్ రిక్వెస్టులు ఎన్ఏసీహెచ్ ద్వారా వెళ్తాయి. ‘‘ఎక్కువ మంది శాలరీ కస్టమర్ల ఆటోడెబిట్ రిక్వెస్టులు ఎన్ఏసీహెచ్ ద్వారా వస్తాయి. ఆదాయాలు తగ్గాయి కాబట్టి ఆటో, వెహికల్ లోన్ సెగ్మెంట్లలో చెల్లింపులు తగ్గడం సాధారణమే. అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, అన్ శాలరీడ్ సెగ్మెంట్లు, క్రెడిట్ కార్డుల పేమెంట్లు ప్రతి నెలా ఒకేలా ఉండవు. ఈ లెక్కలన్నింటినీ గమనిస్తే.. కస్టమర్ల దగ్గర డబ్బు లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నది” అని ఒక క్రెడిట్ బ్యూరో మాజీ ఎగ్జిక్యూటివ్ పారిజాత్ గర్గ్ అన్నారు. స్వయం ఉపాధి పొందే కస్టమర్ల ఆదాయం విపరీతంగా తగ్గడంతో లోన్లు కట్టలేకపోతున్నారని క్రెడిట్ విద్య సీఈఓ అభిషేక్ అగర్వాల్ అన్నారు. కొందరు ఎన్ఏసీహెచ్ అకౌంట్లలో ఉన్న డబ్బును సాధారణ అకౌంట్లకు మళ్లించుకుంటున్నారని వివరించారు.

ఎగవేతలు పెరగొచ్చు..

అన్ని రకాల సెగ్మెంట్ల కస్టమర్లకు ఈ ఏడాది ఆగస్టు వరకు మారటోరియం ఇవ్వాలని ఆర్బీఐ ఆదేశించడం వల్లే ఆటో డెబిట్ రిక్వెస్టులు బౌన్స్ అవుతున్నాయని బ్యాంకర్లు అంటున్నారు. అయితే తొలి విడత మారటోరియం ప్రకటించినప్పుడు.. అడిగిన ప్రతి కస్టమర్ కు మారటోరియం ఇచ్చారు. రెండో విడత మాత్రం బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు కఠినంగా వ్యవహరించాయి. కొందరికే ఈ సదుపాయం కల్పించాయి. ఫేజ్–1లో 30 శాతం మంది కస్టమర్లకు మారటోరియం ఇస్తే, ఫేజ్–2లో ఇది 20 శాతానికి తగ్గింది. ఈ పరిస్థితిని గమనిస్తే లోన్ల ఎగవేతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎన్ఏసీహెచ్ స్పష్టం చేసింది. చెక్ బౌన్స్లు, ఆటో డెబిట్ బౌన్స్ లు కరోనా ముందుకాలంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయని ఎస్ బీ ఎఫ్ సీ ఫైనాన్స్ సీఈఓ అసీమ్ అన్నారు. కస్టమర్ల దగ్గర డబ్బు లేకపోవడం ఎకానమీకి మంచిది కాదని స్పష్టం చేశారు. అయితే కొన్ని బ్యాంకులు మారటోరియం ఎంచుకున్న వారి ఖాతాల నుంచి కూడా ఆటో డెబిట్ ను ఆపడం లేదని ఒక బ్యాంకర్ చెప్పారు. కొన్ని బ్యాంకులు మాత్రం డబ్బు డెబిట్ అయ్యాక, వాపసు చేశాయని వివరించారు. ఎన్ఏసీహెచ్ ఆటో డెబిట్ రిక్వెస్టులు బౌన్స్ అవుతుండటంతో కొన్ని బ్యాంకులు యూపీఐ,  నెఫ్ట్ విధానాలను ఎంచుకుంటున్నాయి. ‘‘ కొన్నిసార్లు టెక్నికల్ సమస్యల వల్ల కూడా ఆటోడెబిట్ రిక్వెస్టు బౌన్స్ అవుతాయి. దీనివల్ల కస్టమర్లకు పెద్దగా నష్టం ఉండదు. క్రెడిట్ స్కోరు తగ్గదు. చెల్లింపులు ఆలస్యం కావడం లేదా పూర్తిగా ఆగిపోయినప్పుడే స్కోర్ తగ్గుతుంది. రాబోయే నెలల్లో బౌన్స్ రేటు తగ్గుతుంది” అని మరో ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్ వివరించారు.

లెక్కలు ఏమంటున్నాయంటే…

మన దేశంలో ఆటోడెబిట్ రిక్వెస్టులన్నీ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (ఎన్ఏసీహెచ్) ద్వారా జరుగుతాయి. దీని ద్వారా బ్యాంకు ప్రెజెంటేషన్ రిక్వెస్ట్ పంపుతుంది. ఖాతాలో డబ్బు ఉంటే డెబిట్ అవుతుంది. లేకపోతే బౌన్స్ అయిందనే సమాచారం వస్తుంది. ఆటో డెబిట్ రిక్వెస్టు బౌన్స్ రేటు ఈ నెలలో 45 శాతానికి చేరింది. మార్చి–మే నెలల మధ్యలో ఇది 37 శాతాన్ని మించలేదు. అంతేగాక బ్యాంకుల నుంచి ప్రెజెంటేషన్లు, ఇనీషియేషన్లు తగ్గాయని ఎన్ఏసీహెచ్ తెలియజేసింది. ఎక్కువ మంది కస్టమర్లు మారటోరియం ఎంచుకోవడం వల్లే ఆటో డెబిట్ రిక్వెస్టులు మే నెలలో తగ్గి, జూన్ లో పెరిగాయి.