ముంబై :రూపే కార్డులు, యూపీఐ పేమెంట్స్ చెల్లింపులపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఛార్జీలు రద్దు చేయడం డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీని చంపేస్తుందని ఆ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎండీఆర్ చార్జీల తొలగింపు సరయిన చర్య కాదని ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. గత శనివారం బ్యాంకర్ల సమావేశం తర్వాత జనవరి 1 నుంచి రూపే కార్డులు, యూపీఐ చెల్లింపుల మీద ఎండీఆర్ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. డిజిటల్ పేమెంట్స్‌కు ఊపు ఇచ్చేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. రూ. 50 కోట్లు అంతకు మించి టర్నోవర్ ఉన్న కంపెనీలన్నింటికీ ఈ రూల్ వర్తిస్తుంది. డిజిటల్ పేమెంట్స్ ఒప్పుకుంటున్నందుకుగాను బ్యాంకులకు మర్చంట్స్ (వ్యాపార సంస్థలు) చెల్లించే ఛార్జీలనే ఎండీఆర్ అంటారు. ఎండీఆర్ రద్దు చేయాలనుకుంటున్నట్లు ఈ ఏడాది జులైలో బడ్జెటప్పుడే ప్రకటించారు.
ఉద్యోగాలూ పోతాయ్….
ఎండీఆర్ రద్దు వల్ల ఈ రంగంలో ఇన్వెస్ట్‌మెంట్, ఇన్నొవేషన్‌లు నిలిచిపోతాయని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ విశ్వాస్ పటేల్ వ్యాఖ్యానించారు. రూపే కార్డులు, యూపీఐ పేమెంట్స్‌పై ఎండీఆర్ తొలగించడం సమంజసం కాదని, పేమెంట్స్ ఇండస్ట్రీని ఈ చర్య చంపేస్తుందని పేర్కొన్నారు. పేమెంట్ ఇండస్ట్రీ బిజినెస్ మోడల్ నిర్వీర్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేమెంట్స్ ఇండస్ట్రీని జాతీయం చేసినట్లవుతుందని పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్స్ ఊపందుకోవాలంటే, అందుకయ్యే వ్యయాన్ని అవసరమైతే ప్రభుత్వమే భరించాలని సూచించారు. పేమెంట్ ఎకోసిస్టమ్‌పై ఈ చర్య ప్రతికూల ప్రభావం చూపెడుతుందని వ్యాఖ్యానించారు. ఇన్నొవేషన్ కనుమరుగవడంతోపాటు ఉద్యోగాలూ పోతాయని హెచ్చరించారు. అన్నింటికీ మించి డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీ ఎదుగుదల ఆగిపోతుందని, కస్టమర్లకు ఇప్పటిదాకా ఇస్తున్న ఇన్సెంటివ్స్ కూడా నిలిచిపోతాయని విశ్వాస్ పటేల్ చెప్పారు. మర్చంట్ ఎక్వైరర్లు, యాగ్రిగేటర్లు పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్లుగా ఉన్నారు.
